
అక్షరాస్యత వైపు అతివలు!
స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ చదువు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం త్వరలో అమలు చేసే అవకాశం డ్రాపౌట్లకు ఉన్నత విద్య జిల్లాలో దాదాపు 40 వేలకు పైగా నిరక్షరాస్యుల గుర్తింపు
దోమ: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఉల్లాస్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అతివలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ప్రక్రియకు ఈ నెల నుంచే అడుగులు పడనున్నాయి. 2017 వరకు సాగిన సాక్షర భారత్ కార్యక్రమం ఆ తర్వాత ఆగిపోయింది. ప్రస్తుతం ఉల్లాస్ పేరిట నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పోర్టల్, యాప్‌ను రూపొందించారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలను వంద శాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో నిరక్ష్యరాస్యులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారందరికీ చదువు చెప్పేందుకు వలంటీర్లను నియమించనున్నారు. సంఘాల్లో చదువుకున్న మహిళలు, ఆసక్తి ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులు, విద్యార్థులను వలంటీర్లుగా ఎంపిక చేయనున్నారు.
40 వేలకు పైగా నిరక్షరాస్యులు
జిల్లాలో దాదాపు 40 వేలకు పైగా నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరి వివరాలను కంప్యూటర్‌లో పొందుపరుస్తున్నారు. పాఠశాలల్లో విద్యావకాశాలు కోల్పోయిన 15 ఏళ్లకు పైబడిన వారందరికీ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక అక్షరాస్యత అందించేందుకు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) పేరిట ప్రత్యేక కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నారు. త్వరలో బోధనను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమం గతేడాదే ప్రారంభం కావాల్సి ఉన్నా వయోజన విద్యాశాఖలో సిబ్బంది కొరత కారణంగా వాయిదా వేశారు. ఈ నెలలో ప్రారంభమై 2027 వరకు కొనసాగనుంది.
ఉల్లాస్‌లో 16 అధ్యాయాలు
అందరికీ చదువు..అందరి బాధ్యత అనే నినాదంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ప్), తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్) సహకారంతో నిర్వహించనున్నారు. నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్యతోపాటు డిజిటల్ అక్షరాస్యత, కీలమైన జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యం, నిరంతర విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగనున్నారు. జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులు, వలంటీర్ల పేర్లను ఉల్లాస్ యాప్‌లో నమోదు చేస్తారు. వారికి ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు తదితర వాటిలో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీటీహెచ్, టీఈఈ ఛానెల్ నంబర్ 14లో క్రమం తప్పకుండా ప్రాంతీయ భాషల్లో వయెజన అభ్యాసకుల కోసం పాఠాలను ప్రసారం చేయనున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు పుస్తకాలను తయారు చేస్తున్నారు. ఉల్లాస్ కార్యక్రమం కింద స్వచ్ఛందంగా పని చేసే చురుకైన విద్యార్థులకు విద్యా క్రెడిట్‌లను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ అనుబంధసంస్థలకు యూజీసీ ద్వారా ఆదేశాలు అందాయి. ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్పొరేట్ సంస్థలను భాగస్వాములు చేస్తున్నారు. నిరక్షరాస్యులందరికీ వలంటీర్లే చదువు నేర్పించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు 10 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. ఆసక్తి ఉన్న వారిని 10వ తరగతి వరకు ప్రోత్సహించాలి. ఏదైనా కారణాలతో 10వ తరగతి మానేసినట్లయితే వారందరినీ గుర్తించి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ చదువుకునేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
సద్వినియోగం చేసుకోవాలి
ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. దీన్ని నిరక్ష్యరాస్యులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.
– శోభ, ఏపీఎం, దోమ