
విజృంభిస్తున్న డెంగీ
జిల్లా వ్యాప్తంగా 36 కేసులు నమోదు తాండూరు పట్టణ పరిధిలో అత్యధికంగా 9 కేసులు ప్రైవేటు ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో.. నామమాత్రపు చర్యలతోసరిపెడుతున్న అధికారులు
తాండూరు: జిల్లాలో డెంగీ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా తాండూరు మున్సిపాలిటీ పరిధిలో 9 కేసులు ఉన్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో 6, పుల్‌మద్ది గ్రామంలో 2, యాలాల మండలం అగ్గనూర్ గ్రామంలో 3 కేసుల నమోదయ్యాయి. జిల్లాలో ఇటీవల ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించింది. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రతి మండలంలో ఒకటి రెండు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరు పట్టణ పరిధిలోని బస్వణ్ణకట్ట ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి డెంగీ సోకడంతో ప్రైవేటుగా చికిత్స పొందుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు కూడా భారీగా నమోదువుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. వీధుల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయడంలేదు. పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించినా పట్టించుకునేవారు లేకుండా పోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మిషన్లు పనిచేయడం లేదు
తాండూరులో నలుగురికి డెంగీ సోకినట్లు వైద్యశాఖ తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాం. ఫాగింగ్ మిషన్లు పని చేయకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. రెండు రోజుల్లో మిషన్లు అందుబాటులోకి వస్తాయి.రాగానే ప్రతి వార్డులో ఫా గింగ్ చేస్తాం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలు, ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
– విక్రమ్‌సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్
మందులు ఉన్నాయి
జిల్లాలో 36 డెంగీ కేసు లు నమోదయ్యా యి. తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఎక్కువ కేసులు ఉన్నా యి. బాధితుల ఇళ్ల వద్ద చర్యలు చేపట్టాం. ఇళ్ల పరిసరాల్లో నీరు నిలవకుండా చూస్తున్నాం. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నాం. ప్రస్తుతం వ్యాధి తీవ్రత అంతగా లేదు. డెంగీ సోకగానే మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఆస్పత్రుల్లో మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయి.
– రవీంద్ర యాదవ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

విజృంభిస్తున్న డెంగీ

విజృంభిస్తున్న డెంగీ