
మా కడుపు కొట్టొద్దు
పూడూరు: ‘గతంలో మాయమాటలు చెప్పి ప్రమాదకర ఫ్యాక్టరీ పెట్టారు.. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ, వాయు కాలుష్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయి.. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం.. ఇప్పుడు ఫ్యాక్టరీని విస్తరించి మా పొట్ట కొట్టాలని చూస్తున్నారు.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము’ అని మీర్జాపూర్ రైతులు తేల్చి చెప్పారు. మంగళవారం పూడూరు మండలం మీర్జాపూర్ పరిధిలోని సుందర్ సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ కోసం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు అక్కడి వచ్చారు. రెండు నెలల క్రితం ఇదే అంశంపై సమావేశం నిర్వహించగా తాము వ్యతిరేకించామని, మళ్లీ ఎందుకు వచ్చారని నిలదీశారు. పరిశ్రమ నుంచి వచ్చే వాసన భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని అధికారులకు విన్నవించారు. తక్షణం ఫ్యాక్టరీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బోర్లు, బావుల్లో నీరు రంగు మారుతోందని, రోగాల బారిన పడుతున్నామని రైతులు తెలిపారు. పరిశ్రమను విస్తరిస్తే చావే శరణ్యమన్నారు. వందల మంది పోలీసుల సమక్ష్యంలో అభిప్రాయ సేకరణ చేయడం ఏమిటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పరిశ్రమను విస్తరించాలని చూస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు. అనంతరం మూకుమ్మడి కార్యక్రమాన్ని బహిష్కరించారు. దీంతో అధికారులు తూతూమంత్రంగా కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జీఎం మహేష్, ఆర్డీఓ వాసుచంద్ర, పూడూరు తహసీల్దార్ భరత్‌గౌడ్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాక్టరీని విస్తరిస్తే చావే శరణ్యం
అనుమతులు ఇస్తే న్యాయ పోరాటం చేస్తాం
ప్రజాభిప్రాయ సేకరణలో తేల్చి చెప్పిన మీర్జాపూర్ రైతులు
కార్యక్రమాన్ని బహిష్కరించి నిరసన