బాల్యానికి మూడుముళ్లు | - | Sakshi
Sakshi News home page

బాల్యానికి మూడుముళ్లు

Aug 12 2025 11:19 AM | Updated on Aug 12 2025 11:19 AM

బాల్యానికి మూడుముళ్లు

బాల్యానికి మూడుముళ్లు

అధికారులు అడ్డుకుంటున్నా ఆగని బాల్యవివాహాలు

‘నందిగామ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక(13)కు మానసిక వైకల్యంతో బాధపడుతున్న కందవాడకు చెందిన ఓ వ్యక్తి(36)తో మే 28న నందిగామ శివారులోని ఓ ఆలయంలో వివాహమైంది. నిజానికి ఈ పెళ్లి చిన్నారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే అంశాన్ని సదరు విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయగా, వారు పోలీసు, రెవెన్యూ, సీ్త్రశిశు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి కుమారుడు, మధ్యవర్తి, పురోహితుడు, బాలిక తల్లిపై నందిగామ ఠాణాలో కేసు నమోదు చేసి సదరు బాధితురాలిని సఖీ కేంద్రానికి తరలించాల్సి వచ్చింది’అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ బాల్య వివాహాలు వెలుగు చూస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అభివృద్ధిలో అంతర్జాతీయ దేశాలతో పోటీ పడుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను అదే స్థాయిలో సామాజిక వెనుకబాటుతనం వెంటాడుతోంది. నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలకు ఆర్థిక అసమానతలు తోడయ్యాయి. ఫలితంగా 18 ఏళ్ల తర్వాత జరగాల్సిన అమ్మాయిల వివాహ తంతు.. 14 ఏళ్లకే ముగుస్తోంది. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోబోనని, అందరిలాగే తాను ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా.. తల్లిదండ్రులు వినిపించుకోవడం లేదు. బలవంతపు పెళ్లిళ్లకు పాల్పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో బాలికలు అత్యవసర ఫోన్‌ నంబర్లను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది నమోదైన బాల్య వివాహాలను పరిశీలిస్తే.. ఇదే విషయం స్పష్టమవుతోంది. గత ఏడాది అత్యధిక బాల్య వివాహాలు వెలుగు చూసిన జిల్లాలో జాబితాలో వికారాబాద్‌(94) ముందు వరుసలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి(54), మేడ్చల్‌ (53) జిల్లాలు నిలవడం గమనార్హం. ఐటీ చదువులకు, అంతర్జాతీయ పెట్టుబడులకు నిల యంగా మారిన ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, బాల్య వివాహాలు వెలుగు చూస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

ఆర్థిక అంతరాలే అసలు కారణం

అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు రాకతో జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జిల్లాలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌, సైబర్‌సిటీ, నానక్‌రాంగూడ, కోకాపేట్‌, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ.వంద కోట్లకుపైగా పలుకుతోంది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్లు ఓఆర్‌ఆర్‌కు ఇరు పక్కలా హైరైజ్‌ భవనాలే దర్శనమిస్తున్నాయి. ఐటీ, వాటి అనుబంధ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు భారీగా వచ్చి చేరడంతో ప్రజల జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో నిలిచిన జిల్లా కూడా ఇదే. ఇలాంటి కీలకమైన జిల్లాలో ఇప్పటికీ అంతరాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఉన్నవాడు మరింత ఉన్నవాడిగా, లేని వాళ్లు మరింత లేనివాళ్లుగా మారుతున్నారు. సామాజిక వెనుకబాటుకు ఆర్థిక పరమైన అంశాలు తోడవడంతో కడుపున పుట్టిన పిల్లలను వదిలించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల శంషాబాద్‌ మండలంలో ఓ తల్లి అప్పుడే పుట్టిన బిడ్డను ఇతరులకు అమ్ముకుని పట్టుబడగా, ఉన్నత చదువులు చదివించి, బిడ్డను మరింత ప్రయోజకురాలిని చేయాల్సిన మరో తల్లి ఏకంగా తన బిడ్డకంటే రెట్టింపు వయసున్న వ్యక్తికి కట్టబెట్టేందుకు సిద్ధపడింది. అంతర్జాతీయ వేదికపై ఓ వెలుగు వెలుగుతున్న ఉమ్మడి జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా.. రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేసి, పైసా ఖర్చు లేకుండానే ఉన్నత చదువులు చెప్పిస్తున్నా.. వివాహం, ఇతర అంశాలకు వచ్చే సరికి తల్లిదండ్రుల ఆలోచన భిన్నంగా ఉంటోంది. అభం శుభం తెలియని వయసులో పెళ్లి చేస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

అత్యవసర నంబర్లను ఆశ్రయిస్తున్న చిన్నారులు

2024లో తొలి మూడు స్థానాల్లో వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement