
ఆర్టీసీకి ఫుల్ గి‘రాఖీ’
● రక్షాబంధన్‌తో కిటకిటలాడిన బస్సులు ● సమకూరిన రెండింతల ఆదాయం
వికారాబాద్: రాఖీ పండుగ ఆర్టీసీకి ఆదాయం సమకూర్చింది. మహిళలకు ఉచిత ప్రయాణంతో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులన్నీ రద్దీగా ఉంటున్నా యి. రక్షాబంధన్‌తో రెండింత ఆదాయం వచ్చింది. జిల్లాలో మూడు ఆర్టీసీ డిపోలు(వికారాబాద్, తాండూరు, పరిగి) ఉండగా 200 పైచిలుకు బస్సులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులు వారివారి గమ్యాలకు వెళ్తుంటారు. వికారాబాద్ డిపో పరిధిలో సాధారణ రోజుల్లో 15 వేల నుంచి 20 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుంటారు. రాఖీ పండుగ నేపథ్యంలో శని, ఆదివారాల్లో 74,242 మంది ప్రయాణించారు. మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా రోజుకు సగటున రూ.4 లక్షల ఆదాయం వచ్చేది.. పండుగ కారణంగా రోజుకు రూ.7 లక్షల చొప్పున రెండు రోజుల్లో రూ.14 లక్షల ఆదాయం సమకూరింది. తాండూరు డిపోలో సాధారణ రోజుల్లో రోజుకు సగటున రూ.10 నుంచి 12 లక్షల ఆదాయం వచ్చేది. రాఖీ నేపథ్యంలో రోజుకు రూ.20 లక్షల ఆదాయం దాటింది. గడిచిన మూడు రోజుల్లో ఈ డిపోకు రూ.66 లక్షలు సమకూరింది. పరిగి డిపోకి మూడు రోజుల్లో కలిపి రూ.72లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇందులో 75శాతం వరకు మహాలక్ష్మీ పథకంలో భాగంగా వచ్చిందే. సాధారణంగా రోజుకు రూ.16లక్షల వరకు ఆదాయం రాగా పండుగ సందర్భంగా రోజుకు రూ.25లక్షలు సమకూరింది.