
దానమ్మదేవి అలంకరణ
తాండూరుటౌన్: శ్రావణమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని శ్రీభావిగి భద్రేశ్వరస్వామి దేవస్థానంలోని శివాలయంలో పరమశివుడు మహారాష్ట్రలో వెలిసిన దానమ్మదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుక్కల దాడిలో
12 మేకపిల్లలు మృతి
ధారూరు: వీధి కుక్కల దాడిలో 12 మేకపిల్లలు మృతిచెందిన ఘటన అంతారంలో చోటుచేసుకుంది. బాధితుడు చాకలి యాదయ్య వివరాల ప్రకారం.. చుట్టూ ఇనుప కంచె ఉన్న కొట్టంలో ఆదివారం ఉదయం 12 మేకపిల్లలను వదిలివెళ్లాడు. వీధి కుక్కలు లోనికి జొరబడి తీవ్రంగా గాయపర్చడంతో అవి చనిపోయాయి. సాయంత్రం వచ్చి చూసిన బాధితుడు బోరున విలపించాడు. తనకు రూ.50 వేల నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. నాగారం ఉప పశువైద్యాధికారి సురేందర్ సోమవారం గ్రామానికి వెళ్లి మేకపిల్లకు పోస్టుమార్టమ్ నిర్వహించారు.
ఎన్‌ఐఎంయూ, ఎఫ్‌సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన
కందుకూరు: ఫ్యూచర్‌సిటీ భూముల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐఎంయూ), ఎఫ్‌సీడీఏ (ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ) కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ (ఎంఓహెచ్‌యూఏ) కార్యదర్శి కె.శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ కమిషన్ ఆర్‌వీ కర్ణన్ తదితరులు సోమవారం మండల పరిధిలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలోని సర్వే నంబర్ 112 లోని భూమిని పరిశీలించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ కోసం గతంలో కేటాయించిన 20 ఎకరాలు, ఎఫ్‌సీడీఏ కార్యాలయం కోసం అదే సర్వే నంబర్‌లో 7.20 ఎకరాలను క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు. వారి వెంట ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
గుంతల రోడ్డుపై నిరసన
యాచారం: వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని తక్కళ్లపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తక్కళ్లపల్లి– తక్కళ్లపల్లి గేట్ మధ్యన ధ్వంసమైన రహదారిపై వరి నాటు వేసి నిరసన వ్యక్తంచేశారు. అధ్వానంగా మారిన రోడ్డుతో ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదన్నారు. సమస్య ను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ, పంచాయతీరాజ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యా దు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆందోళన చేసిన వారిలో బీజేపీ నాయకులు పగడాల శ్రీశైలం, కుమార్ యాదవ్, డాక్టర్ సురేందర్, గడల సురేష్, బాబురావు, నర్సింహ, అంజయ్య, రాములు ఉన్నారు.
ఏఈఈలకు పదోన్నతులు
డీఈఈలుగా ప్రమోషన్, బదిలీ
కేశంపేట: ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఐదుగురికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతులు లభించాయి. షాద్‌నగర్ పరిధి ఫరూఖ్‌నగర్ మండలంలో ఏఈఈగా పనిచేస్తున్న సుజాతను నారాయణపేటకు, కొందుర్గు మండలంలో పనిచేస్తున్న క్రాంతిని వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్‌ఈ కార్యాలయానికి, కేశంపేటలో విధులు నిర్వర్తిస్తున్న గీతను వనపర్తికి, రేఖను జహీరాబాద్, మాధవిని జగిత్యాల జిల్లాకు బదిలీ చేస్తూ, ప్రమోషన్లు కల్పించారు.

దానమ్మదేవి అలంకరణ

దానమ్మదేవి అలంకరణ

దానమ్మదేవి అలంకరణ