
సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచుతాం
● ఆఫీసులు, విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం ● మెరుగైన విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నాం ● పేదలందరికీ రేషన్ కార్డులు,సన్నబియ్యం ఇస్తున్నాం ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మొయినాబాద్: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కృష్టి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తూజగూడలో చిలుకూరు, బాకారం, నవాబ్‌పేటకు సంబంధించిన 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ.. సోలార్ ఉత్పత్తిని పెంచడంకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా ఇప్పటికే అదేశాలిచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పూర్తిగా సోలార్ విద్యుత్‌ను అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ, దేవాదాయ, ఇరిగేషన్ భూముల్లో అనుకూలతను బట్టి సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ పంపిణీ వ్యవస్థను సైతం పెంచేందుకు కొత్తగా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని.. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం కోసం రాష్ట్రంలో 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొయినాబాద్ ప్రాంతంలో పట్టణీకరణ పెరుగుతుండడంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంత విద్యుత్ అవసరాల కోసం 132 కేవీ సబ్ స్టేషన్‌ను మంజూరు చేస్తున్నామని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్‌కుమార్, విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్‌అలీ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.