
ధీమా ఇవ్వని బీమా
కేశంపేట: రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతుబీమాను ప్రవేశ పెట్టింది. అందుకు 18 నుంచి 59 ఏళ్లవారిని అర్హులుగా పేర్కొంది. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి ఆధార్‌కార్డు, నామిని వివరాలతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను జతచేసి ఉన్న దరఖాస్తులను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించారు. అలా వారు సేకరించిన ఆధారాల ప్రకారం.. బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లించింది. అనంతరం రైతుల పేరిట బీమా సంస్థ జారీ చేసిన ఐడీ నంబర్‌తో కూడిన బాండ్లను వ్యవసాయశాఖ.. రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు బాండ్లు తమకు అందలేదని, బీమా ఉందన్న ధీమా లేకుండా పోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు.
అధికారులే బాధ్యులు?
బీమా పత్రాల్లో తప్పులు ఉంటే మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులే బాధ్యులని ప్రభుత్వం గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. రైతులు తమ ఆధార్‌కార్డులో ఇంటిపేరు, పేరు, వయస్సు లాంటి వివరాలను మార్చుకుంటే క్లయిమ్ సమయంలో ఇబ్బందులు వస్తాయని, దీనికి అధికారులే బాధ్యతను వహించాల్సి ఉంటుందని తెలిపింది. గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆధార్‌కార్డులో మార్పులు, చేర్పులు, పుట్టిన తేది, నామిని తదితర వివరాలను మార్చుకోవాలని అనుకుంటే.. విస్తరణ అధికారులను సంప్రదించి బీమా నమోదులో సవరణ చేసుకోవాలని రైతులకు అవగాహనను కల్పించాల్సి ఉంటుంది.
అవగాహన కరువు
పత్రాల్లో ఏమైనా తప్పులు ఉంటే దానిని సరిచేసుకోవడానికి రెనివల్ సమయంలో అవకాశం కల్పించారు. అయితే బాండ్లు అందకపోవడంతో.. అందులో తప్పులు ఉన్న విషయం తెలియకపోవడం వలనే రైతులు మార్చుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఈ నెల 12 వరకు మాత్రమే మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నూతనంగా జూన్ 5 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు.. ఈ నెల 13 వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఇదిలా ఉండగా.. బీమా ఉన్నప్పటికీ.. పత్రాలు అందక పోవడంతో అందులో తప్పులు ఏమున్నాయో తెలియడం లేదని రైతులు పేర్కొనడం గమనార్హం.
2019 నుంచి
పథకం ప్రారంభంలో అర్హులైన రైతులకు ప్రభుత్వం బాండ్లను అందజేసింది. 2019 నుంచి ఇవ్వడం లేదు. దీని కారణంగా అందులో తప్పులు ఏమున్నాయో రైతులకు తెలియడం లేదు. ఏమైనా తప్పుడు సమాచారం ఉంటే.. భవిష్యత్‌లో రైతు కుటుంబ సభ్యులు క్లయిమ్‌కు వెళ్లినప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇప్పటి వరకు అఫిడవిట్‌ను వ్యవసాయ అధికారులకు సమర్పించి, క్లయిమ్ పొందేవారు. కానీ ఇప్పుడు అఫిడవిట్ లేదని, బీమా పత్రం ఆధారంగానే చెల్లింపు ఉన్నట్లు సమాచారం.
బాండ్లు ఇవ్వాలి
ప్రభుత్వాలు రైతులకు బీమా బాండ్లను అందించలేదు. వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే క్లయిమ్ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పవు. పత్రాలను అందజేస్తే.. మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం వెంటనే బీమా పత్రాలను రైతులకు అందజేయాలి. – నరేందర్‌రెడ్డి, సంతాపూర్
బీమాను ఎత్తివేసేందుకు కుట్ర
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదు. గత ప్రభుత్వం తెచ్చిన రైతుబీమా పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే కొత్తగా నమోదు చేసుకునేందుకు మూడు రోజుల గడువే ఇచ్చింది. బీమా చేసుకున్న వారికి పత్రాలు అందజేయలేదు.
– నవీన్‌కుమార్, మాజీ సర్పంచ్, కొత్తపేట
రైతులకు అందని పత్రాలు
తప్పుల సవరణకు సమీపించిన గడువు
రేపటితో ముగింపు
అవగాహన లోపంతో అన్నదాతలు
క్లెయిమ్‌లో తప్పని తిప్పలు