
సమస్యలు పరిష్కరించాలి
కందుకూరు: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి వినియోగించకుండా ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తోందని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. మండల కేంద్రంలో సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్‌రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం రెండో మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వామపక్షాల పోరాట ఫలితంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పడిందన్నారు. ప్రస్తుతం బోర్డు నిధులను పక్కదారి పట్టించడంతో ఇబ్బందిగా మారిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు ద్వారానే నిధులను కార్మికులకు ఖర్చు చేస్తున్నాయని, ఇక్కడ మాత్రం ఆవిధంగా లేదన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా, 50 ఏళ్లు దాటిన కార్మికులకు పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా పోల్కం శ్రీరాములు, అధ్యక్షుడిగా బండి సత్తయ్య, ఉపాధ్యక్షులుగా కొమురయ్య, గోల్కండ లక్ష్మయ్య, కోశాధికారిగా ఆర్.రవి, ఉపాధ్యక్షుడిగా జింకల సత్యనారాయణ, కమిటీ సభ్యులుగా శేఖర్, యాదయ్య, ఉప్పుల కృష్ణ, చిన్నయ్య, అంబటి సురేష్, మాదారం సురేష్, కె.నరసింహ, వెంకటేశ్ ఎన్నికయ్యారు.
భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్