
ఐక్య పోరాటానికి సిద్ధంకండి
● 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధనకు రాష్ట్రం నుంచి ఎంపికై న బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని.. లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీసీ బిల్లును తేల్చకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం జరుగుతోందని అన్నారు. దీనిని సాకుగా చూపి పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయడంలేదన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తూ ఇక్కడ అడ్డుపడటం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు అనుకూలం అంటునే బండి సంజయ్, కిషన్‌రెడ్డి, రాంచంద్రరావు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపించారు. రేవంత్ సర్కార్ అందరినీ కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని.. అందుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.సామేల్, తాడిగళ్ల భాస్కర్, దుబ్బాక రామచందర్, ఏర్పుల నర్సింహ, బి. జగదీశ్, జిల్లా కమిటీ సభ్యులు ఆలంపల్లి నరసింహారావు, జంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, జి.నర్సింహ, కిషన్, రుద్రకుమార్, జగన్, సుమలత, విఘ్నేష్, పురుషోత్తం పాల్గొన్నారు.