
సాధారణ పరిహారమేనా?
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి గ్రామాలకు చెందిన 1,275 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రైతులు తమ పొలాలను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇస్తూ పరిహార చెక్కులను తీసుకుంటున్నారు. కానీ భూములు ఇవ్వని మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మరో అడుగు ముందుకేసింది. జనరల్ అవార్డు ప్రకటించేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించి జూలై 19న నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. హకీంపేట్ గ్రామానికి చెందిన రాకం యాదయ్య సర్వేనంబర్ 240లో 2.21 ఎకరాలు, అదే గ్రామానికి చెందిన రఘులకోల ప్రదీప్ కుమార్ సర్వేనంబర్ 245లో 10 గుంటల పట్టా భూమికి గాను నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వారిరువురి విషయంలో కోర్టునుంచి పరిహారం ఇవ్వనున్నట్లు తెలిసింది. అంగీకారంతో ఇచ్చే భూములకు వచ్చే పరిహారం కాకుండా సాధారణ పరిహారం మంజూరు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా లగచర్ల గ్రామానికి చెందిన భూములు ఇవ్వని రైతులకు కూడా జనరల్ అవార్డు కింద నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
జనరల్ అవార్డు ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
భూములు ఇవ్వని రైతులకు షాక్