
కొండెక్కిన కూరగాయలు
ధరలు పెరగడంతో సామాన్యుల తిప్పలు
● అదుపులోకి తేవాలని విజ్ఞప్తి ● సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని విశ్లేషణ
నవాబుపేట/మోమిన్‌పేట: రోజురోజుకూ మార్కెట్‌లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఏది కొందామన్నా కొండెక్కి కూర్చొని సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికితోడు నిత్యావసర వస్తువుల ధరలు సైతం అమాంతం పెరగడంతో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ప్రజలు విలవిలలాడుతున్నారు. భగ్గుమంటున్న ధరలను అదుపు చేసేందుకు పాలకులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నవాబుపేట, తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి, మొక్కజొన్న తదితర వాణిజ్య పంటలు అధికంగా సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వర్షాలు సమయానికి కురవకపోవడం కూరగాయలు, పప్పుదినుసుల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దీంతో కాయకూరలకు ధరలు బాగా పెరిగాయి.
రెట్టింపైన నిత్యావసరాలు
కూరగాయలకు తోడు నిత్యావసర సరుకుల ధరలు నెల రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పెసర్లు కిలోకి రూ.120, మినుములు కిలో రూ.100, బొబ్బర్లు రూ.90. ఉలువలు రూ.100, పచ్చజొన్నలు రూ.40, ధనియాలు రూ.100, వెల్లుల్లి రూ.100, మినపపప్పు రూ.130, శనగ రూ.70 పలుకుతున్నాయి. కోడిగుడ్డు ధర ప్రస్తుతం రూ.6 ఉంది. పెరిగిన ధరలను చూసి వినియోగదారులు జంకుతున్నారు. నిత్యం కూలినాలీ చేసుకొని జీవించే శ్రమజీవులు పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు.
శాకాహార ప్రియులతో..
శ్రావణమాసంలో మెజార్జీ హిందువులు మాంసాహారానికి దూరంగా ఉంటారు. కూరగాయల ధరల పెరుగుదలకు ఈ అంశం కూడా కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో కూరగాయలు, ఆకు కూరలతో చేసిన వంటలే ఉపయోగిస్తారు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెజిటెబుల్స్ వినియోగం అమాంతం పెరిగింది. అందుకే ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి.
వికారాబాద్ మార్కెట్‌లో ధరలు
రకం ధర(కిలోకి)
పచ్చిమిర్చి రూ.120
మునగకాయలు రూ.120
చిక్కుడు రూ.100
బీన్స్ రూ.100
క్యాప్సికం రూ.80
బెండకాయ రూ.80
బీరకాయ రూ.80
క్యారెట్ రూ.60
టమాట రూ.60
వంకాయ రూ.60
ఉల్లిగడ్డ రూ.60
సొరకాయ(ఒక్కటి) రూ.15