
కూరగాయలకు వెళ్లి.. వరదనీటిలో మునిగి..
మొయినాబాద్: కూరగాయలు తెచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన ఓ వలస కూలి వరద నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో శుక్రవారం వెలుగుజూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. నారాయణఖేడ్ జిల్లా దామరగిద్దకు చెందిన వంశిరాజు ఇంద్రప్ప(50), భార్య అంజమ్మతో కలిసి రెండు నెలల క్రితం బతుకుదెరువుకోసం హిమాయత్‌నగర్‌కు వలస వచ్చారు. కూలీపనిచేస్తూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. కాగా గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంద్రప్ప కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో హిమాయత్‌నగర్ చౌరస్తాలో రోడ్డుపై వరదనీరు పెద్ద ఎత్తున చేరింది. రోడ్డుపైన నిలిచిన వరదనీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఇంద్రప్ప కల్వర్టు వద్ద గుంతలో పడి నీటిలో మునిగిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో నీటిలోనే మునిగి మృతి చెందాడు. తన భర్త తిరిగి రాలేదని అంజమ్మ రాత్రి సమయంలో పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం తిరిగి వెతుకుతుండగా హిమాయత్‌నగర్ చౌరస్తాలో ఉడిపి హోటల్ దగ్గర ఉన్న కల్వర్టు గుంతలో మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వలస కూలి మృతి