గుర్తుతెలియని మహిళ అందులో
ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది?
హడావుడిగా దహన సంస్కారాలు ఎందుకు చేశారు?
ముమ్మాటికీ అది హత్యే : భూమన
ఆ ఇల్లు ఓ రాజకీయ పార్టీ
జిల్లా అధ్యక్షుడిదని ప్రకటన
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తిరుపతి నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన గుర్తుతెలియన మహిళ మరణం మిస్టరీగా మారింది. పోలీసులు గుర్తుతెలియని మహిళది ఆత్మహత్య అని అంటుంటే.. వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి అది ముమ్మాటికీ హత్యే అని సంచనల ప్రకటన చేశారు. ఆమె మరణం వెనుక ఓ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నారని ఆరోపించారు. నగరంలో నెల క్రితం జరిగిన మహిళ మరణంపై భూమన కరుణాకరరెడ్డి చేసిన సంచలన ప్రకటన ప్రస్తుతం తిరుపతిలో హాట్ టాపిక్‌గా మారింది. మహిళ మృతి చెందిన లక్ష్మీనిలయం ఇల్లు ఎవరిది? ఎవరా రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు? ఆమె మరణానికి సదరు నాయకుడికి సంబంధం ఏంటి? అనేది చర్చనీయాంశమైంది.
అక్టోబర్ 27న ఘటన
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని లక్ష్మీనిలయం పేరిట ఉన్న ఇంట్లో అక్టోబర్ 27న ఓ మహిళ మృతదేహం లభించినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే పోలీసులు గుర్తుతెలియని మహిళ మృతదేహమని వెల్లడించారు. అది కూడా ఆ ఇంట్లో మేడపైకి వెళ్లే నిచ్చెనకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే ఆమె మృతదేహాన్ని దహన సంస్కారాలు చేయించేశారు. దీనిపై భూమన కరుణాకరరెడ్డి ఆరోపించడం నగరంలో సంచలనం రేపింది. ఈ క్రమంలో పోలీసులు నమోదు చేసిన కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరా రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు?
జిల్లాకి చెందిన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు అని భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణ చేయడంతో.. ఎవరు ఆయన ? అంటూ నగర వాసులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. నిందితుడు ఎవరని తెలిసీ పోలీసులు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కేసుని నీరుగార్చేందుకు యత్నించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వ్యహరించిన తీరు చూస్తుంటే.. కూటమి పార్టీలకు చెందిన వారా? లేదా.. అధికార పార్టీలతో మంచి సంబంధాలు సాగిస్తున్న మరేదైనా పార్టీ అధ్యక్షుడా? అనే చర్చ మొదలైంది. పోలీసులు నమోదు చేసిన కేసు ఫైల్‌లో స్పష్టంగా పెద్దకాపు లేఅవుట్‌లోని లక్ష్మీనిలయం అని పేర్కొన్నారు. గుర్తు తెలియని మహిళ ఆ నివాసంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏముంది? జనసంచారం లేని చోట ఆత్మహత్య చేసుకుని ఉండేవారు కదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ నివాసం ఎవరిది? అనే విషయం పోలీసులకు తెలియకుండా ఉంటుందా? అనే అనుమానాలను సైతం పలువురు వెలిబుచ్చుతున్నారు. రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడిని కాపాడేందుకే ఆ నివాసానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు.
తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని ‘లక్ష్మీనిలయం’ ఎవరది?
గుర్తుతెలియని మహిళ ఓ ఇంట్లోకి వెళ్లి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది..? ఆ నివాసంలోని వారికి ఆమెతో ఎలాంటి సంబంధం లేకుంటే లోపలికి ఎలా అనుమతించారు..? మృతురాలి ఆచూకీ తెలిసే వరకు మృతదేహాన్ని పోలీసులు ఎందుకు భద్రపరచలేదు..? ఎవరి ఒత్తిడి కారణంగా వెంటనే దహన సంస్కారాలు చేయించేశారు..? ఒక మహిళ మరణం వెనుక అనేక అనుమానాలు.. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి మంగళవారం ఓ సంచలన ప్రకటన చేశారు. మిస్టరీ మరణం వెనుక ఓ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి హస్తం ఉన్నట్లు ఆరోపించారు. మృతదేహం ఉన్న నివాసం సదరు నాయకుడిదే అని స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.
నెల గడిచినా ఆచూకీ తెలియలేదా?
పోలీసులు పేర్కొన్నట్టు ఆమె మరణించి సుమారు నెల కావస్తోంది. ఇన్ని రోజులు గడిచినా పోలీసులకు ఆమె ఆచూకీ లభ్యం కాలేదా? లక్ష్మీనిలయం ఎవరిది అనేది గుర్తించలేదా? ఆమె ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఇంత వరకు వెల్లడించకపోవడంపై భూమన కరుణాకరరెడ్డి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ సాయంతో పోలీసులు అనేక కేసులను గంటలు, రోజుల సమయంలోనే ఛేదించినవి అనేకం ఉన్నాయి. అలాంటిది ఓ గుర్తుతెలియని మహిళ మరణం గురించి తెలుసుకోలేకపోయారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణం వెనుక దాగిన మిస్టరీని ఛేదించి.. నిందితుడిని అరెస్టు చేయకపోతే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడిని అరెస్టు చేయిస్తామని భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించటం గమనార్హం.


