వీరందరి నాయకుడు కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టం అధికారుల అవినీతి చిట్టా సిద్ధం చేశాం ఏసీబీ, లోకాయుక్త, విజిలెన్స్, ఐటీ శాఖలకు అందిస్తాం అక్రమ ఏకగ్రీవాలపై న్యాయ పోరాటం చేస్తాం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గంలో ఆలీబాబా 40 దొంగల తరహాలో అధికారులు వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తుమ్మలగుంటలోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో సాగినట్లు నామినేషన్ల తిరస్కరణ దేశంలో ఎక్కడా జరగలేదని మండిపడ్డారు. 38 మంది రిటర్నింగ్ అధికారులు, ఒక ఆర్‌డీఓ, ఒక డీపీఓ కలిసి 40 మంది దొంగల మాదిరిగా వ్యవహరించారని, వీరికి కలెక్టర్ నాయకత్వం వహించారని విమర్శించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రలోభాలకు లొంగి వేలాది నామినేషన్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులెవరినీ వదిలిపెట్టేది లేదని, ఆర్‌ఓ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరి అవినీతి బండారం బయటపెడతామని, ఈ మేరకు ఆధారాలను సేకరించామని స్పష్టం చేశారు. వీరందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ఎన్నికల్లో తప్పులు చేసిన అధికారుల అక్రమ ఆస్తుల వివరాలతో ఏసీబీ, లోకాయుక్త, విజిలెన్స్ కమిషనర్, ఆదాయపు పన్నుశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. చంద్రగిరిలో జరిగిన నామినేషన్ల తిరస్కరణ వ్యవహారంపై హైకోర్టు, సుప్రీం కోర్టులో ప్రైవేట్ కేసులు దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.
2,680 నామినేషన్ల తిరస్కరణ
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్క్రూటినీ పేరుతో ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 2,680 నామినేషన్లను తిరస్కరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చని చెవిరెడ్డి విమర్శించారు. ఈ అసాధారణ పరిణామాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
అవినీతి చిట్టా బయటపెడతాం
అవినీతి అధికారుల బినామీ ఆస్తులకు సంబంధించిన అంశాలను కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళతామని చెవిరెడ్డి చెప్పారు. ఆర్‌ఓ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ఎవరు ఎంత తీసుకున్నారు ? ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారు ? ఎవరి బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు ? అనే వివరాలను ప్రజలు, మీడియా, దర్యాప్తు సంస్థల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకునే వరకు రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.
38 మంది ఆర్‌ఓలు, ఒక ఆర్‌డీఓ, ఒక డీపీఓ
న్యాయ పోరాటం చేస్తాం
అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమంగా ఏకగ్రీవం చేసుకున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలపైనా ఆధారాలతో న్యాయ పోరాటం చేస్తామని, ఆ పదవుల్లో కూర్చున్న వారికి ప్రశాంతత లేకుండా చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే రెండేళ్లలోగా బాధిత అభ్యర్థులను తిరిగి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పదవుల్లో కూర్చోబెట్టేలా ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా కోర్టుల్లో ఉత్తర్వులు తీసుకు వస్తామని స్పష్టం చేశారు.
20 గంటల నిరీక్షణ వృథా
నామినేషన్ల తిరస్కరణపై జిల్లాలో 542 మంది అభ్యర్థులు ఆర్‌డీఓకు అప్పీలు చేసుకున్నారని తెలిపారు. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు చలిలో వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా 20 గంటలకు పైగా అభ్యర్థులు ఆర్‌డీఓ కార్యాలయం వద్ద నిరీక్షించారని వెల్లడించారు. చివరకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల అప్పీళ్లను సరైన కారణాలు చూపకుండానే తిరస్కరించారని ఆరోపించారు. తొలుత అప్పీళ్లకు వెళ్లిన నామినేషన్లను ఆమోదిస్తామని చెప్పి, ఆ తర్వాత నిర్ణయం మార్చుకోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు అంతే ఉన్నతంగా వ్యవహరించకుండా పోస్టింగ్‌లు, డబ్బులు, ప్రలోభా ల కోసం వేలాది మంది రాజకీయ భవిష్యత్‌కు సమా ధి కట్టడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.


