బీసీలకు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

బీసీలకు వెన్నుపోటు

Nov 25 2026 9:42 AM | Updated on Nov 25 2026 9:42 AM

● తిరుపతి డిప్యూటీ మేయర్‌ పదవి ఇవ్వకుండా మొండిచేయి ● అగ్రవర్ణాలకు కట్టబెట్టడంపై కూటమిలోనే వెల్లువెత్తుతున్న నిరసన ● జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పీఠం ఆశించి భంగపడిన బీజేపీ జెడ్పీటీసీ సభ్యులు తేజోవతి ● నిరాశతో పదవికి రాజీనామా చేసే యోచన ● గతంలో వెనుకబడిన వర్గాలకే పెద్దపీట వేసిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, తిరుపతి : బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే కూటమి పార్టీలు వెనుకబడిన వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అని చెప్పుకునే టీడీపీ, దాని మిత్రపక్షాలు పదవులను ఇచ్చే సమయంలో మాత్రం వెన్నుపోటు పొడుస్తున్నాయని వాపోతున్నాయి. ప్రతిష్టాత్మకమైన తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌ పదవిని ఆశించినప్పటికీ జనరల్‌ రిజర్వేషన్‌ రావడంతో అగ్రవర్ణాలకే కేటాయించారని, కనీసం డిప్యూటీ మేయర్‌ అయినా తమ వర్గానికి వస్తుందని బలహీనవర్గాలు భావించాయి. నగరంలో రెండో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు డిప్యూటీ మేయర్‌ ఇవ్వాలంటూ ఆ సామాజికవర్గం నేతలు ఈ నెల 7వ తేదీన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో డిమాండ్‌ చేశారు. నగరపాలక సంస్థ కొత్త పాలకవర్గంలో 14 మంది యాదవులు ఉన్నారని, వారిలో ఎవరో ఒకరికి పదవి ఇవ్వాలని అఖిలభారత యాదవ మహాసంఘం తరఫున కోరారు. ఇప్పటికే కూటమి నుంచి తిరుపతి ఎమ్మెల్యే, మేయర్‌ పదవుల్లో ఆగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే ఉండడంతో తప్పనిసరిగా బీసీలకు డిప్యూటీ మేయర్‌గా అవకాశం ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా డిప్యూటీ మేయర్‌గా జనసేన పార్టీ తరఫున గెలిచిన పాలడగు విజయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో బీసీల ఆశలు అడియాశలయ్యాయి. డిప్యూటీ మేయర్‌ సైతం అగ్రవర్ణాలకే వెళ్లడంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు మండిపడుతున్నాయి.

వైఎస్సార్‌సీపీ హయాంలో సముచిత స్థానం

బలహీనవర్గాలకు ఆర్థిక, సామాజిక తోడ్పాటునివ్వడంతోపాటు రాజకీయంగా సైతం వైఎస్సార్‌సీపీ ప్రోత్సహించింది. 2021లో జరిగిన తొలి తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో యాదవ సామాజికవర్గానికి డాక్టర్‌ ఆర్‌.శిరీషను బరిలో నిలిపి గెలిపించుకుంది. రెండో పర్యాయం సైతం జనరల్‌ కేటగిరి రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ యాదవ సామాజికవర్గానికి చెందిన వాసు యాదవ్‌కు అవకాశం కల్పించింది. తమది బీసీల పార్టీగా చెప్పుకునే చంద్రబాబు, దాని మిత్రపక్షాలు తిరుపతిలో ఏనాడూ ఇలాంటి అవకాశం బీసీలకు ఇచ్చిన పాపానపోలేదు. మరోవైపు డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా సోమవారం ఎస్వీ సెనేట్‌ హాల్‌లో కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. డిప్యూటీ మేయర్‌ పదవి కోసం పాలడుగు విజయ పేరును ప్రతిపాదించగానే టీడీపీకి చెందిన దళిత నేత, 8వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుబ్బయ్య బిగ్గరగా అరుస్తూ తన ఆక్రోశం వెలిబుచ్చారు. తిరుపతిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు లేరా..? పదవులన్నీ మీకేనా ? అంటూ ప్రశ్నించారు. 130 ఏళ్ల చరిత్రలో తిరుపతి మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్‌ పదవులు ఎస్సీ, ఎస్టీలకు దక్కలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాలడుగు విజయకు మద్దతుగా చేయి ఎత్తకుండా సుబ్బయ్య నిరాకరించి తన అసమ్మతిని తెలిపారు.

రాజీనామా దిశగా అడుగులు!

కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా పరిషత్‌ పదవుల విషయంలోనూ బీసీలకు మొండిచేయి ఎదురైంది. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవిని బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఆ పార్టీ తరపున రేణిగుంట జెడ్పీటీసీగా గెలుపొందిన తేజోవతి ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. బీసీలకు వైస్‌ చైర్మన్‌ పదవి కేటాయించాలని బీజేపీతో పాటు కూటమి నేతలకు విన్నవించుకున్నారు. తీరా చూస్తే సూళ్లూరుపేట జెడ్పీటీసీ సభ్యుడు ఆరణి కిషన్‌రెడ్డికి పదవి దక్కింది. దీంతో ఆగ్రహించిన తేజోవతి జెడ్పీటీసీగా ప్రమాణస్వీకారానికి సైతం హాజరుకాకపోవడం చర్చనీయాశంమైంది. కూటమిలో పదవులన్నీ కొన్ని వర్గాలకే చెందుతున్నాయని, బీసీలకు అన్యాయం జరుగుతోందని తన వర్గీయుల వద్ద తేజోవతి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసే యోచనలో సదరు బీసీ మహిళా నేత ఉన్నారని సమాచారం. ఏదీ ఏమైనా కూటమి ప్రభుత్వంలో కీలకమైన పదవులు బీసీలకు దక్కకపోవడంపై ఆయా వర్గాలు తీవ్రమైన నిరాశలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement