తిరుమలలో తగ్గిన రద్దీ | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన రద్దీ

Nov 25 2026 9:42 AM | Updated on Nov 25 2026 9:42 AM

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 75,640 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,439 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.13 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 1 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

నేటి నుంచి

ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌

చంద్రగిరి : తిరుపతి పశువైద్య కళాశాలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వెటర్నరీ పాలిటెక్నిక్‌ విద్యార్థుల కోసం బుధవారం నుంచి 14వ ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌, గేమ్స్‌, కల్చరల్‌ అండ్‌ లిటరరీ మీట్‌ నిర్వహించనున్నారు. మంగళవారం ఈ మేరకు రాపూరు యానిమల్‌ హస్బెండరీ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో బుక్‌లెట్‌ విడుదల చేశారు. 28వ తేదీ వరకు నిర్వహించనున్న పోటీల్లో సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొంటారు. ముఖ్య అతిథిగా వెటర్నరీ వీసీ వైకుంఠరావు, ప్రత్యేక అతిథిగా టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మురళీకృష్ణ, గౌరవ అతిథిగా డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ (డీన్‌), అధ్యక్షుడిగా తిరుపతి పశువైద్య కళాశాల అసోసియేట్‌ డీన్‌ మాలకొండయ్య, యూనివర్సిటీ పరిశీలకుడిగా జయచంద్ర వ్యవహరించనున్నారు. ఈ పోటీలు తిరుపతి పశువైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు, సాంస్కృతిక కార్యక్రమాలు కళాశాల ఆడిటోరియంలో జరగనున్నాయి. బుక్‌లెట్‌ను స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బి. రాంబాబు నాయక్‌, డాక్టర్‌ చైతన్య కుమార్‌, డాక్టర్‌ రాజా ఆవిష్కరించారు.

జనవరి 31లోపు

రీసర్వే పూర్తికి ఆదేశం

తిరుపతి అర్బన్‌ : రీసర్వే పనులను వచ్చే ఏడాది జనవరి 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి వారు వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. తిరుపతి కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు హజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీసర్వేతోపాటు 22ఏ, వెబ్‌ల్యాండ్‌, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, మాన్యువల్‌ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. జేసీ గోవిందరావు మాట్లాడుతూ 6వ విడత రీసర్వే పనులు 82 శాతం పూర్తిచేశామని చెప్పారు. 27 గ్రామాలు మాత్రమే ఉన్నాయిన వాటిని త్వరలో పూర్తి చేసి 7వ విడత రీసర్వే ప్రారంభిస్తామని వెల్లడించారు. డీఆర్‌ఓ నరసింహులు, సూళ్లూరుపేట ఆర్‌డీఓ దేవేందర్‌ రెడ్డి, ల్యాండ్‌ అండ్‌ సర్వే అధికారి రామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement