తిరుపతి సిటీ : మానవ మనుగడకు సుస్థిర నీటి వనరులు, నిర్వహణ అత్యంత కీలకమని కేంద్ర భూగర్భ జలమండలి ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. ఎస్వీయూ సెనేట్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర నీటి వనరుల పరిరక్షణ, నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న నేషనల్ సెమినార్ మంగళవారం ప్రారంభమైంది. డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయంలో నీటిని ఆదా చేయడానికి ప్రభుత్వం బిందు సేద్యం, సూక్ష్మ సేద్యం వంటి అనేక పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి పౌరుడు నీటి చుక్కను ఆదా చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి సేకరణ, నమామి గ్యాంగ్ వంటి కార్యక్రమాలను ప్రారంభించినట్లు వివరించారు. వీసీ నర్సింగరావు మాట్లాడుతూ ఎల్‌నినో అత్యంత ప్రభావవంతమైన పర్యావరణ సమస్యలలో ఒకటి అని, ఇది వర్షాలను నిలిపివేసి అస్తవ్యస్తమైన వాతావరణ పరిస్థితులను సృష్టిస్తుందని తెలిపారు. అనంతరం సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ రూపొందించిన ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర సాంస్కృతిక వైభవం అనే పుస్తకం ఆవిష్కరించారు. జేఎన్‌యూ ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ జనార్ధన్‌రాజు, విద్యాభారతి రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్ సింహశాస్త్రి, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి, కన్వీనర్ ప్రొఫెసర్ మధు, సైదారావు, ప్రొఫెసర్ వైవీ రామిరెడ్డి, ప్రొఫెసర్ రాజశేఖర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.


