బూతులు తిడుతూ.. బూటు కాళ్లతో
తన్నుతారా?
14 మంది మాజీ సైనికులపై
నాన్ బెయిలబుల్ కేసులా?
ఎస్పీ సుబ్బరాయుడును దేవుడు కూడా కాపాడలేడు: చెవిరెడ్డి ఆగ్రహం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడిన మాజీ సైనికుల చేతులకు సంకెళ్లు వేస్తారా?. బందిబోట్లు, దోపిడీ దారులుగా చిత్రీకరించి.. అక్రమంగా హత్యాయత్నం కేసులు బనాయించి.. తీరని అవమానాలకు గురిచేస్తారా..? ఈ పాపం ఎస్పీ సుబ్బరాయుడు, ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టదు.. భవిష్యత్‌లో ఆ భగవంతుడు కూడా ఎస్పీ సుబ్బరాయుడును కాపాడలేడు.. అంటూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని కోర్టు వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంకు చెందిన ఎస్టీ అభ్యర్థి నామినేన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా టీడీపీ గూండాలు అడ్డుకుని దాడి చేశారని బాధితుడు తెలిపిన నేపథ్యంలో.. అతడికి భద్రతగా వెళ్లిన 14 మంది మాజీ సైనికులపై దొంగతనం, దోపిడీ, హత్యాయత్నం, బందిపోట్లుపై పెట్టే కేసులను నమోదు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎస్పీ సుబ్బారాయు డు వ్యవహరించిన తీరుపై దేశ వ్యాప్తంగా మాజీ సైనికులు ఉద్యమిస్తారన్నారు. దేశం కోసం 25 ఏళ్ల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికులపై ఇలాంటి అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. దుర్గసముద్రంలో ఎస్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితుడికి అండగా వెళ్లిన మాజీ సైనికులను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
మాజీ సైనికులకు తీరని అవమానం
దేశ రక్షణ కోసం క్రమశిక్షణతో పనిచేసిన మాజీ సైనికుల పట్ల తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, అతని సిబ్బంది తీరని అవమానాలకు గురిచేశారని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. బూతులు తిడుతూ, బూటు కాళ్లతో తన్నుతూ మానసిక క్షోభకు గురిచేశారన్నారు. అంతేకాకుండా వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి తీరని అన్యాయం చేశారన్నారు. చంద్రబాబుకు వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేసిన ఎస్పీ సుబ్బరాయుడు పవిత్రమైన తిరుపతిలో రౌడీయిజం, గూండాయిజాన్ని పెంచి పోషిస్తూ.. మాజీ సైనికులపై అక్రమ కేసులు పెట్టి అవమానిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా ఉన్న తనకు ఈ కూట మి ప్రభుత్వం భద్రత కల్పించక పోవడంతో ప్రైవేటు భద్రతా సిబ్బందిగా మాజీ సైనికులను నియమించుకున్నట్టు చెవిరెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వద్ద కూడా మాజీ సైనికులు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. భద్రతా విధులు నిర్వర్తించే వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
బందిపోట్లు, దోపిడీ దారులుగా చిత్రీకరిస్తారా?
మాకు సంబంధం లేని కేసులో ఇరికించారు
తాము చేయని తప్పుకు పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రంతా నరకం చూపించారని, అక్రమ కేసుల్లో ఇరికించి మానసిక వేదనకు గురిచేశారంటూ అక్రమ కేసులో నిందితుడైన మాజీ సైనికుడు శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడ నుంచి తిరుపతికి వచ్చామని, స్థానిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వద్ద భద్రతా విధులు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని తెలియడంతో తాము అక్కడికి వెళ్లామన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వినోద్‌కుమార్, కిరణ్‌కుమార్ అనే వ్యక్తులు ఎవరో కూడా తమకు తెలియదని శివప్రసాద్ పేర్కొన్నారు. జీవనోపాధి కోసం భద్రతా విధులు నిర్వర్తించేందుకు తిరుపతికి వచ్చామని, తాము స్థానికులం కాదని, సంబంధిత వ్యక్తులతో తమకు పరిచయం లేదని తెలిపారు. అయినప్పటికీ తమపై అక్రమ కేసులు పెట్టి 36 గంటలుగా పోలీస్ స్టేషన్‌లో బంధించి తమ కుటుంబీకులకు సమాచారం కూడా ఇచ్చే అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సరి హద్దుల్లో విధులు నిర్వర్తించిన తమ పట్ల తిరుపతి పోలీసులు ప్రవర్తించిన తీరు నీచంగా ఉందన్నారు. ఈ ఘటనను మాజీ సైనికులందరి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. తిరుపతి పోలీసులు 14 మంది మాజీ సైనికులపై అక్రమంగా నమోదు చేసిన కేసుల వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా తెలిసేలా ఉద్యమిస్తామనేరు. తిరుపతి పోలీసులపై సుప్రీం కోర్టులో కేసు వేస్తామని పేర్కొన్నారు.
మాజీ సైనికులకు రిమాండ్
ఇదిలావుండగా మాజీ సైనికులకు తిరుపతి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.


