● సంతకాలు, చెక్‌లిస్ట్‌లు లేవంటూ అనేక నామినేషన్ల తిరస్కరణ ● నామినేషన్ల సమయంలో లేని ఫారం.. పరిశీలన సమయంలో ప్రత్యక్షం ● సంతకాలు లేవంటూ భారీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తొలగింపు ● టీడీపీ నేతల కనుసన్నల్లో ఆర్వోలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏకపక్షంగా సాగుతోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో సంబంధిత అధికారులు నడచుకుంటున్నారు. నామినేషన్ల సందర్భంగా పోలీసులు, అధికారులు వ్యహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. తాజాగా నామినేషన్ల పరిశీలనలోనూ అధికారులు టీడీపీ నాయకులకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి జిల్లాలో 444 ఎంపీటీసీ స్థానాలకు 2,950 మంది నామినేషన్లు వేయగా.. వాటిలో 1,964 నామినేషన్లు ఆమోదం పొందాయి. తిరస్కరణకు గురైన నామినేషన్లు 570 చూపించారు. మరోచోట 541 నామినేషన్లు తిరస్కరించినట్లు ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే 29 నామినేషన్లు తేడా చూపిస్తున్నారు. రెండు చొప్పున నామినేషన్లు వేసినవి 395 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వేసిన నామినేషన్లు 893 కాగా.. వాటిలో తిరస్కరణకు గురైనవి 271, ఆమో దం లభించినవి 622 దాకా ఉన్నాయి. అదే టీడీపీ అభ్యర్థులు వేసిన వాటిలో ఆమోదం లభించిన నామినేషన్లు 937, తిరస్కరించినవి 186 మాత్రమే.
జెడ్పీటీసీ నామినేషన్లలోనూ అంతే!
తిరుపతి జిల్లాలో మొత్తం 35 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి 323 మంది నామినేషన్లు వేసినట్లు ప్రకటించారు. పరిశీలన సందర్భంగా ఒకే ఒక్క నామినేషన్ తిరస్కరించగా.. 322 నామినేషన్లు ఆమోదించినట్లు ప్రకటించారు. ఈ లెక్కన ఒకే ఒక్క నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. అయితే అధికారులు ఇచ్చిన మరో కాలంలో 9 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఉంది. అధికారులు విడుదల చేసిన జాబితానే తప్పుల తడకగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తొట్టంబేడు, ఏర్పేడు, వెంకటగిరి మండలాలకు ఒక్క నామినేసన్ కూడా రానట్టు అధికారులు విడుదల చేసిన జాబితాలో చూపించారు. అయితే ఆ మండలాల్లో టీడీపీ శ్రేణులు ఏకగ్రీవమయ్యామని సంబరాలు చేసుకోవడం గమనార్హం.
ఇప్పుడెలా వచ్చిందబ్బా?
నామినేషన్ సందర్భంగా లేని ఫారం పరిశీలన సమయంలో ప్రత్యక్షమైందని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ ఫారంలో సంతకాలు లేవంటూ ఇష్టానుసారం నామినేషన్లను తిరస్కరించారంటూ మండిపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సంతకాలు చేయలేదనే కారణంతో అనేక మంది నామినేషన్లు తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఒక్క ఏర్పేడు మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. ఒకే ఒక్క నామినేషన్ మాత్రమే ఆమోదించి.. మిగిలినవన్నీ తిరస్కరించడమే ఇందుకు నిదర్శనం. అదేవిధంగా సూళ్లూరుపేట పరిధిలోని పెళ్లకూరులోనూ ఇదే తరహాలో నామినేషన్లను తిరస్కరించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చెక్‌లిస్ట్‌లు లేవంటూ అనేక మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. ఈ విషయంపై రామచంద్రాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. చిన్నగొట్టిగల్లు మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ, జనసేన అభ్యర్థులు నామినేషన్లు ఆమోదించారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై టీడీపీ నేతలు ఒత్తిడి చేశారు. తిప్పిరెడిగారిపల్లి, కోటబైలు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలని గొడవ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఏకగ్రీవాలకు కూటమి కుట్రలు
ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు కూటమి నేతల కుట్రలకు తెరలేపారు. జిల్లాలో అనేక ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ ముసుగులో టీడీపీ ఫేక్ అభ్యర్థులు నామినేషన్లు వేయించారు. అలా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 23 మంది చేత వేయించిన నామినేషన్లను తిరస్కరించి ఏకగ్రీవాలకు మార్గం సుగమం చేసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సంతకాలు చేయలేదనే కారణంతో అనేక మంది నామినేషన్లను తిరస్కరించారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, అధికారులు కుమ్మకై ్క ఓబులవారిపల్లె మండలంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ఎంపీపీని ఏకగ్రీవం చేసుకునే విధంగా కుట్రపన్నారు. పుల్లంపేట మండలంలో ఇరువురి వైఎస్సార్సీపీ అభ్యర్థులను తిరస్కరించారు.. ఒకరిని కిడ్నాప్ చేశారు. మెజార్టీ మండలాల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది.


