చంద్రగిరి: చంద్రగిరి మండలంలో వైఎస్సార్‌సీపీ నామినేషన్లను భారీగా తిరస్కరించారు. మొత్తం 16 సెగ్మెంట్లకు గాను అందులో ఐదు సెగ్మెంట్లలోనే ఆమోదం పొందేలా నాటకమాడారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన నామినేషన్ పత్రాల పరిశీలనలో టీడీపీ నేతలతో అధికారులు కుమ్మకై నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ వెంకటరత్నంచౌదరి, ఆర్వోలు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి కుంటి సాకులతో నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సీఎం చంద్రబాబు సొంత సెగ్మెంట్ చిన్నరామాపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌లో ఖర్చుల వివరాలు పొందుపరచలేదని, ఏ.రంగంపేట సెగ్మెంట్‌లో పత్రాలను జిరాక్స్ పెట్టారని తిరస్కరించారు. నరసింగాపురం, చంద్రగిరి–1, చంద్రగిరి–2, చంద్రగిరి–3, చంద్రగిరి–5, కొటాల, కల్‌రోడ్డుపల్లి, దోర్నకంబాల, ఐతేపల్లి సెగ్మెంట్లలోని అభ్యర్థులు జిరాక్స్ కాపీలను పెట్టారని, ఒరిజినల్స్ పెట్టలేదనే సాకుతో వాటిని తిరస్కరించారు. ఇక తొండవాడ, మిట్టపాళెం, శానంబట్ల, చంద్రగిరి–4, పనపాకం సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు.
నామినేషన్ కేంద్రంలోనే తిష్టవేసి
అధికార పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్ కేంద్రంలోనే తిష్టవేశారు. 16 సెగ్మెంట్లలోని నామినేషన్ పత్రాల పరిశీలనలో వారు పాల్గొని, అధికారుల ఎదుటే అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరించారని, అనధికారికంగా కేంద్రంలో ఉన్న వారిని బయటకు పంపమని చెప్పినా పట్టించుకోలేదని చెబుతున్నారు.


