26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ | - | Sakshi
Sakshi News home page

26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

Oct 25 2026 1:23 AM | Updated on Oct 25 2026 1:23 AM

తిరుమల: తిరుమలలో సోమవారం పౌర్ణమి గరుడసేవ జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఉప రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష

రేణిగుంట: భారత ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్‌ ఈ నెల 26, 27 తేదీలలో తిరుపతి, తిరుమల పర్యటన నేపథ్యంలో శనివారం రేణిగుంట విమానాశ్రయంలో ముందస్తు భద్రతా శ్రేణి లైజన్‌ (ఎ.ఎస్‌.ఎల్‌) అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు, తిరుపతి మునిసిపల్‌ కమిషనర్‌ ఎమ్‌.జయకృష్ణ, ఉపరాష్ట్రపతి కార్యాలయపు అధికారులతో కలసి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ముందస్తు ఏర్పాట్ల పై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారి నాగబాబు, అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు, నాగభూషణరావు, వెంకటరాముడు, శ్రీకాళహస్తి, తిరుపతి ఆర్‌డీఓలు భానుప్రకాష్‌రెడ్డి, రామ్మోహన్‌, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ భూమినాథన్‌, తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

చివరి రోజు 38 నామినేషన్లు

తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా రీ నోటిఫికేషన్‌లో చివరి రోజు శనివారం 18 డివిజన్లకు గాను 38 నామినేషన్లు వచ్చినట్లు కమిషనర్‌ జయకృష్ణ తెలిపారు. ఇందు లో వైఎస్సార్‌సీపీ–22, టీడీపీ–1, జనసేన–1, బీఎస్పి–2, ఆమ్‌ఆద్మీ–1, స్వతంత్ర–11 చొప్పున నామినేషన్లు దాఖాలైనట్టు వెల్లడించారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన, మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఆపై తుది జాబితాను ప్రకటించనున్నారు.

66 డివిజన్లకు 543

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 66 డివిజన్లకు మొత్తం 543 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ – 161, టీడీపీ– 204, జనసేన –81, స్వతంత్ర అభ్యర్థులు –69తో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ, సీపీఐ అభ్యర్థులూ ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు 65 డివిజన్లలో బరిలోకి దిగారు.

ఎంఫార్మసీ, బీఫార్మసీకి స్పాట్‌ అడ్మిషన్లు

తిరుపతి సిటీ: ఎస్వీయూ ఫార్మసీ కళాశాలలో ఎంఫార్మసీ, బీఫార్మసీ కోర్సులలో చేరదలచిన విద్యార్థులు ప్రత్యేక పేమెంట్‌ సీట్లకు సంబంధించి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు తెలిపారు. జీఫ్యాట్‌ రాసినవారికి తొలి ప్రాధాన్యత, ఏపీపీజీ ఈసెట్‌ అర్హులకు రెండవ ప్రాధాన్యత, మిగిలిన వారికి మూడవ ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎంఫార్మసీ కోర్సుకు ఏడాదికి రూ.1,66,925 చెల్లించాల్సి ఉంటుందని, బీఫార్మసీ కోర్సుకు ఏడాదికి రూ.81 వేలు చెల్లించాలని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు వర్సిటీలోని డీఓఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement