తిరుపతి తుడా : జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా గురువారం రుయా ఆస్పత్రిలో రక్తదానంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ఆరోగ్యవంతులైన స్వచ్ఛంద దాతలే ప్రధాన ఆధారమని వెల్లడించారు. ఒకరి రక్తదానం ద్వారా అనేకమంది రోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు.
ఉద్యానం అభివృద్ధిపై
నేడు డ్రోన్ షో
తిరుపతి అర్బన్: రాయలసీమ ఉద్యాన సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ మైదానంలో డ్రోన్ షో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే దిశగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
తైక్వాండో, టెన్నిస్
జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం అండర్–14, 17, 19 విభాగాల కింద తైక్వాండో, టెన్నిస్ ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. తిరుపతి ఎమ్మార్‌పల్లె జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన తైక్వాండో పోటీలకు, అకార్డ్ పాఠశాలలో నిర్వహించిన టెన్నిస్ పోటీలకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శులు సాంబశివరావు, అమ్ములు తెలిపారు.
తిరుమలలో భక్తుల ఆందోళన
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పలువురు భక్తులు బుధవారం ఆందోళనకు దిగారు. తిరుమలలోని అదనపు ఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పెరటాసి మాసం, వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని టీటీడీ నిర్ణయించింది. అయితే ఈ విషయం తెలియక 1వ తేదీ గురువారం దర్శనం కోసం పలువురు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సిఫార్సు లేఖలు సమర్పించేందుకు ప్రయత్నించగా అధికారులు నిరాకరించారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు అడిషనల్ ఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సిఫార్సు లేఖలు స్వీకరించాలని నినాదాలు చేశారు. అధికారులు భక్తులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైను శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 77,082 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,039 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించమని స్పష్టంచేసింది.


