అసామాన్య ఆధ్యాత్మిక శిఖరం | - | Sakshi
Sakshi News home page

అసామాన్య ఆధ్యాత్మిక శిఖరం

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

చిరస్మరణీయం.. కల్కి భగవాన్‌ ప్రస్థానం

వరదయ్యపాళెం: ఏకం వ్యవస్థాపకుడు కల్కి భగవాన్‌ జీవితం సామాన్య స్థాయి నుంచి అసామాన్య ఆధ్యాత్మిక శిఖరంగా ఎదిగే వరకు సాగింది. ఆయన అసలు పేరు విజయ్‌కుమార్‌ నాయుడు. 1949లో తమిళనాడులోని నేతంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రారంభంలో ఎల్‌ఐసీలో క్లర్క్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1977 జూన్‌ 9న పద్మావతితో వివాహం జరిగింది. తర్వాత ఆధ్యాత్మికత, విద్యారంగం వైపు అడుగులు వేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రాజుపేట వద్ద ’జీవాశ్రమం’ పేరుతో రెసిడెన్షియల్‌ స్కూల్‌ను స్థాపించారు. 1990 ప్రాంతంలో తనను కల్కి అవతారంగా ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి కల్కి భగవాన్‌గా, ఆయన సతీమణి పద్మావతి అమ్మ భగవాన్‌గా భక్తులకు పరిచయమయ్యారు. తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని నేమంలో తొలిసారిగా ఆధ్యాత్మిక బోధనలు ప్రారంభించారు. ఆ తర్వాత వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురంలో తన కార్యాలయం ఏర్పాటు చేశారు. అనంతరం ఉబ్బలమడుగు సమీపంలో ఒన్నెస్‌ యూనివర్సిటీ పేరుతో నాలుగు క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. 1999 తర్వాత బత్తలవల్లంలో ఏకం క్షేత్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో తెల్ల పాలరాతితో నిర్మించిన ఏకం ఆలయం 2005లో ప్రారంభమైంది. అమ్మ భగవాన్‌తో కలిసి కల్కి భగవాన్‌ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులకు బోధనలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్తులు ఉన్నారు. గ్రామీణాభివృద్ధి, ఒన్నెస్‌ హ్యూమన్‌, లోకా ఫౌండేషన్‌, ముక్తి వంటి పలు ట్రస్టులను స్థాపించారు. ఈ ట్రస్టుల ద్వారా వందలాది గ్రామాల్లో తాగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేదల కోసం ఆస్పత్రలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ విద్యార్థులకు ఉచిత విద్య, పుస్తకాల పంపిణీ, పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement