ప్రాంతీయ వనరులే కీలకం | - | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ వనరులే కీలకం

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

తిరుపతి అర్బన్‌ : ఆర్థికాభివృద్ధికి ప్రాంతీయ వనరులే కీలకమని తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ సీఈఓ ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్‌లో విజన్‌–2047 సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు కలెక్టర్లు పాల్గొన్నారు. ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌్‌ లోని తొమ్మిది జిల్లాలు రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 50 శాతం ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 34 శాతం వాటా మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో రీజియన్‌ ఆర్థిక వృద్ధికి అవకాశం ఉన్న రంగాలను గుర్తించాలని సూచించారు. అందుబాటులో ఉన్న భూమి, భవిష్యత్‌ అవసరాలకు కావాల్సిన ల్యాండ్‌, పెట్టుబడి అవసరాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు, పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌, వైబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ వంటి వనరులను అనుసంధానం చేస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని వివరించారు. ఇందుకోసం ప్రత్యేక అడ్వైజరీ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ తిరుపతి ప్రధాన ఆర్థిక, పర్యాటక కేంద్రంగా ఉందని, ఈ ప్రాంత అభివద్ధిని మరింత వేగవంతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. తిరుపతికి వచ్చే భక్తులు సగటున సుమారు 18 గంటలు మాత్రమే జిల్లాలో గడుపుతున్నారని, ఈ సమయాన్ని 36 నుంచి 48 గంటలకు పెంచే విధంగా సదుపాయాలను అభివద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలను పరిపాలనా పరంగా మూడు వేర్వేరు జిల్లాలుగా ఉన్నప్పటికీ, అభివద్ధి పరంగా ఒకే ప్రాంతంగా భావించి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న భూమిని సమర్థవంతంగా వినియోగించుకుని పెట్టుబడులను ఆకర్షించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సుమారు 2వేల నుంచి 2,500 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు. సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, జేసీ గోవింద రావు, డీఆర్‌ఓ నరసింహులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement