స్థానిక పోరుకు వైఎస్సార్‌సీపీ రె‘ఢీ’
తిరుపతి రూరల్: రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల సమరానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమవుతోందని, గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి.. బలమైన అభ్యర్థులను బరిలోకి దించి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 27 నెలల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీలకు పాడెకడుతాయన్నారు. తిరుపతిలోని తన నివాసం వద్ద ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా జరగాలని, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలని చూస్తే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికారుల ఒత్తిళ్లు, పోలీసుల దౌర్జన్యాలు చోటుచేసుకుంటే చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.
కుప్పం నుంచే కుట్రలకు శ్రీకారం
చంద్రబాబు తన రాజకీయ కుతంత్రాలకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. వర్షాలు లేక, సాగునీరు లేక, పెరిగిన ధరలతో తినడానికి తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళుతున్నారన్నారు. నిన్నటి వరకు మున్సిపల్ కార్పొరేషన్, మండల స్థాయి ఎన్నికలు విడివిడిగా నిర్వహిస్తామని చెప్పి, ఇప్పుడు రెండింటినీ ఒకేసారి నిర్వహిస్తామని చెప్పడానికి కారణం కూడా అదేనన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా అన్ని చోట్ల పోటీ పెడతామన్నారు. డీఎస్సీ నియామకాల విషయంలోనూ అవకతవకలు జరిగాయన్నారు. దీనిపై ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులే టీడీపీ గుండాలను వెనుకేసుకొచ్చి దాడులు చేయించి, తిరిగి వారిపైనే కేసులు పెట్టారన్నారు.
సచివాలయ ఉద్యోగుల పోరాటానికి మద్దతు
గత ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరిన సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. బదిలీలు, అధిక పనిభారం పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకు వెళుతున్న సచివాల ఉద్యోగులను అరెస్టు చేస్తున్నారని, వారిపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చేస్తున్న పోరాటానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను సరిదిద్ది, ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. చివరగా పుంగనూరులో భారీ పరిశ్రమ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకుంటోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే పరిశ్రమ కోసం సుమారు 800 ఎకరాల భూమిని కేటాయించామని, వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం తిరిగి అధికారం లోకి రాగానే పుంగనూరులో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకున్న భారీ పరిశ్రమ ను తిరిగి తీసుకు వస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేగౌడ, సునీల్‌కుమార్, సమన్వయకర్తలు విజయానందరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోటి రాజేష్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు.


