పెళ్లకూరు: అక్రమ కేసులు పెట్టి, నెలల తరబడి జైల్లో నిర్బంధించి భయపెడుదామనుకోవడం కూటమి నాయకుల మూర్ఖత్వమేనని, భయం జగనన్న సైనికుల బ్లడ్‌లోనే లేదని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి చిల్లకూరులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నివాసానికి చేరుకొని ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ ఇప్పటికి సుమారు ఇరవైకి పైగా ఆక్రమ కేసులు సత్యనారాయణరెడ్డిపై పెట్టి మూడు పర్యాయాలు జైలుకు పంపడం కూటమి నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. అధికార పార్టీ నాయకులతో కలిసి కొందరు పోలీసులు చేస్తున్న చట్ట వ్యతిరేక విధాలను ప్రజలు గమనిస్తున్నారని, అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని, అధికారం మారినప్పడు అటు కూటమి నాయకుల తోపాటు ఇటు పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో స్వర్ణముఖి నదిలో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు 97 రోజులు సత్యనారాయణరెడ్డిని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మళ్లీ ఇప్పడు వ్యవసాయ భూముల్లో పనులు చేసుకుంటుండగా టీడీపీ రౌడీమూకలు వెళ్లి పనులను అడ్డుకొని పోలీసులు సాక్షిగా దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు. అదే సమయంలో ఘటనా స్థలానికి వెళుతున్న ఓ టీడీపీ కార్యకర్త పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులంతా చూస్తుండగా అనారోగ్య సమస్యతో కుప్పకూలి మృతి చెందాడని, అయితే దానిని రాజకీయం చేస్తూ కొందరు పోలీసు అధికారులు తప్పుడు కేసులు నమోదు చేసి సత్యనారాయణరెడ్డిని మళ్లీ జైలుకు పంపడం చాలా దుర్మార్గమన్నారు. సత్యనారాయణరెడ్డి అక్రమ కేసులకు భయపడే రకం కాదన్నారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం
పోలీసు యంత్రాంగం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం, పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపడంపై కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఎన్ని కేసులు పెట్టినా చట్టపరంగా పోరాటం చేస్తామని చెప్పారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించే గొంతులను పోలీసుల ద్వారా నొక్కేయాలనుకోవడం పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో తప్పుడు కేసులకు వత్తాసు పలుకుతున్న అధికారులకు కాకాణి హెచ్చరికలు జారీచేశారు. సత్యనారాయణరెడ్డికి, ఆయన కుటుంబానికి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ మొత్తం అండగా ఉంటుందని కాకాణి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దాల సోమశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ప్రిస్కిల్లా, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరత్నం, సుబ్రమణ్యంరెడ్డి, నాయకులు మోహన్, జనార్ధన్‌రెడ్డి, పట్టాభిరెడ్డి, కిశోర్‌యాదవ్, గిరిరెడ్డి, వెంకటరాఘవరెడ్డి, రఘునాయుడు, రవీంద్ర, మురళి, బాలసుబ్రమణ్యం, ఆనంద్, రాఘవయ్య, ప్రసాద్, చంద్రయ్యనాయుడు, గోపాలయ్య, మాతయ్య, కిష్టయ్య, బాలచంద్ర, సురేష్‌రెడ్డి, శ్రీనివాసులు, చంద్రయ్య పాల్గొన్నారు.


