జై పోలేరమ్మా.. జైజై పోలేరమ్మా | - | Sakshi
Sakshi News home page

జై పోలేరమ్మా.. జైజై పోలేరమ్మా

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

వైభవంగా ఘటోత్సవం

భక్త జనసందోహం నడుమ కదిలిన ఘటం

సైదాపురం/వెంకటగిరిరూరల్‌: రాష్ట్ర పండుగ అయిన వెంకటగిరి శ్రీపోలేరమ్మ తల్లి జాతర అశేష జనసందోహం నడుమ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. పట్టణ నలుమూలల జన కోలాహలం కనిపిచింది. జనాలతో కిక్కిరిసిన ప్రధాన వీధుల్లో పోలేరమ్మ ఘటం ముందుకు కదిలింది. జై పోలేరమ్మా.. జైజై పోలేరమ్మా నామస్మరణతో పట్టణం మార్మోగింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతర లో ప్రధాన ఘట్టమైన ఘటోత్స వేడుకలు అమ్మవారి మెట్టునిల్లు వద్ద నుంచి ప్రారంభమయ్యాయి.

వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో మొదటి ఘట్టంగా భావించే ఘటోత్సవం వైభవంగా ప్రారంభమైంది. పట్టణమంతా జన సంద్రమైంది. ఏటు చూసినా జై పోలేరమ్మా.. జై జై పోలేరూ అంటూ కేకలతో ఒక్క సారిగా వెంకటగిరి పట్టణం మార్మోగిపోయింది. అమ్మవారికి బలి ఇచ్చే దున్నపోతును ఘటం వెంటే ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. రాజాగారి ఇంటి వద్ద తొలి పూజలు అందుకునే సమయంలో తొలుత అమ్మవారి దున్నపోతుకు పూజల అనంతరం ఘటం కుండలకు పూజలు చేయాల్సి ఉంది. కానీ ఈ ఏడాది తొలుత ఘటం కుండలకు పూజలు చేసి అమ్మవారి దున్నపోతును వాహనం దించకుండానే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అంతకుముందు కాంపాళెంలో దున్నపోతుకు ప్రత్యేక పూజలు చేశారు.

ఘటోత్సాహం

పట్టణంలోని గాలిగంగుల దేవస్థానంలో ప్రత్యేక పూజలతో ఘటోత్సవాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 02.30 గంటల ప్రాంతంలో పట్టణంలోని జీనిగల వారి వీధిలో ఉన్న చాకలి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. మొదటగా పత్తివారి సాంగ్యాన్ని ఘటం కుండలకు సమర్పించి పూజలు చేశారు. జీనిగల వారివీధి వద్ద ప్రారంభమైన ఘటోత్సవం అంజనేయస్వామి గుడివీధి మీదుగా పోలేరమ్మ దేవస్థానం వద్దకు చేరుకుంది. అనంతరం పోలేరమ్మ వీధిగండా రాజావీధి, రాజానగరి వెనుక వైపు గల పత్తివారి ఇంటికి ఘట్టం చేరుకుంది. రాజాల అనుచరులు ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది. పోలీసులు అప్రమత్తమైన లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది.

ప్రారంభమైన వెంకటగిరి జనజాతర

ఘటంకు ద్వితీయ పూజలు

వెంకటగిరి జాతరలో భాగంగా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాలకు పెద్దపీట వేశారు. ఆ రోజుల్లో వెంకటగిరి సంస్థానాధీశుల దగ్గర పనిచేసే తాడిపత్రి వెంకట్రాయులను ఉద్దేశించి ఏమైనా ఆస్తులు, సంపద కోరుకోవాలని సూచించగా.. ఆయన అందుకు ప్రతిగా ‘నాకేమీ వద్దు. పోలేరమ్మ తల్లి జాతరలో ఘటంకు ముందుగా మీ ఇంట పూజలు నిర్వహించిన అనంతరం మా ఇంట రెండో పూజ జరిగేలా చూడాలి’ అని కోరుకోవడంతో అప్పటి నుంచి అదే సంప్రదాయం కొనసాగుతోంది. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి, సీఐలు రోశయ్య, సంగమేశ్వరరావులు, పోలేరమ్మతల్లి జాతర కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement