కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

● చలో విజయవాడను అడ్డుకోవడం దారుణం ● తిరుపతి, శ్రీకాళహస్తిలో భారీ నిరసన

తిరుపతి తుడా: తిరుపతిలో సచివాలయ ఉద్యోగులు కదంతొక్కారు. భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆదివారం తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించమని గళమెత్తితే పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో కొట్టడం దారుణమన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి హాజరుకాకుండా పలు ప్రాంతాల్లో, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో పోలీసులను మోహరించి అడ్డుకున్నారని మండిపడ్డారు. గత రెండేళ్ల నుంచి ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని సూచించారు.

ఉద్యమం ఉధృతం

సచివాలయ ఉద్యోగుల సమస్యలపై గత రెండేళ్లుగా ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని పలువురు మండిపడ్డారు. తక్షణం జీవో నం.11ను రద్దు చేసి, పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలని, సెలవు రోజుల్లో పనిభారం తగ్గించాలని, డిప్యూటేషన్లను పూర్తిగా రద్దు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌గా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషన్‌ చానల్‌ ఇచ్చే క్రమంలో బేసిక్‌ పే రూ.30 వేలకు తగ్గకుండా చూడాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు పుండరీ కాంక్ష, జయపాల్‌ నాయక్‌, రజనీకుమారి, మస్తానప్ప, కరుణాకర్‌, అమరావతి, పలువురు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement