వైభవం.. కల్యాణ వెంకన్న రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. కల్యాణ వెంకన్న రథోత్సవం

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

మహారథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి ఊరేగింపు అశ్వ వాహనంపై కల్కీ అవతారంలో స్వామి వారి దర్శనం నేడు చక్రస్నానం, రాత్రికి ధ్వజావరోహణం

తిరుపతి రూరల్‌: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం వైభవంగా సాగింది. ఎనిమిదో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బ్రహ్మరథంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి రథాన్ని భక్తులు గోవింద నామస్మరణలతో లాగుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి బయలుదేరిన మహా రథం గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగి 11.30 గంటలకు ఆలయానికి చేరుకుంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. రథంపైకి ఉప్పు, మిరియాలు చల్లుతూ గోవింద, గోవిందా అంటూ ముందుకు కదిలారు. రథోత్సవానికి ముందు కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కల్కీ కటాక్షం

ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు మంగళవారం రాత్రి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు అశ్వ వాహనంపై కల్కీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగంలో దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ కోసం కల్కీ అవతారంలో అశ్వ వాహనంపై స్వామివారు విహరిస్తూ కనువిందు చేశారు. రథోత్సవంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు, కుమారులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు

నేడు తుమ్మలగుంటలో చక్రస్నానం

తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన బుధవారం ఉదయం 7 నుంచి 9గంటల మధ్యన చక్రస్నానం నిర్వహించనున్నారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అందుకు తగిన ఏర్పాట్లు అన్నీ పూర్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement