చవితి వేడుకల గొడవల్లో ముగ్గురిని అరెస్టు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు స్టేషన్‌లోకి చొరబడి.. పోలీసులపై టీడీపీ నేత చిందులు ఖాకీ చొక్కాలు వేసుకోకుంటే సినిమా చూపిస్తానని హెచ్చరిక మౌనం దాల్చిన పోలీసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతలు హల్‌చల్ చేసిన ఘటన తిరుపతి రూరల్‌లో కలకలం రేపింది. వినాయక చవితి వేడుకల సందర్భంగా జరిగిన గొడవలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. వారిని విడిపించేందుకు వచ్చిన స్థానిక టీడీపీ నేతలు ఆదివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో రచ్చరచ్చ చేసిన వీడియో మంగళవారం వెలుగులోకివచ్చింది. తిరుపతి రూరల్ మండలం, లింగేశ్వరనగర్ పంచాయతీ, టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అనుచరులైన చిట్టి రాయల్, అతని తల్లి హేమలత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా యువకుల మధ్య గొడవ జరగడంతో పరస్పరం బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్నారన్న ఫిర్యాదులపై పోలీసులు ఒక వర్గం నుంచి ఇద్దరు యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ విషయం తెలుసుకున్న చిట్టి రాయల్ తన తల్లి టీడీపీ మహిళా నాయకురాలు హేమలతతో కలసి ఆదివారం అర్ధరాత్రి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై చిందులేశారు. గట్టిగట్టిగా అరుస్తూ భయానక వాతావరణం సృష్టించారు. పోలీసులు తీసుకువచ్చిన యువకులను బలవంతంగా బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.
పోలీసుల విధుల్లో జోక్యంపై చర్చ
ఒక కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న టీడీపీ నాయకులు.. సిబ్బందితో వాగ్వాదానికి దిగడం, హెచ్చరికలు చేయడం వంటి పరిణామాలు పోలీసు వర్గాల్లో చర్చకు దారి తీశాయి. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు పరిశీలించి పోలీసు ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
లోకేష్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా
పోలీసులతో వాగ్వాదం సందర్భంగా చిట్టి రాయల్ మాట్లాడుతూ ‘ఖాకీ యూనిఫాం లేకుంటే ఇక్కడే సినిమా చూపించుండే వాడిని.. మా వాళ్లను ఎలా తీసుకొస్తారు ? విజయవాడకు వెళ్లి మంత్రి నారా లోకేష్‌కు చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా. మీకు ఎంత ధైర్యం ఉంటే మా వాళ్లను తీసుకొస్తారు.. మీ సంగతి తేలుస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకున్న పరిణామాలను ఓ పోలీసు కానిస్టేబుల్ వీడియో రికార్డు చేస్తుండగా.. అతనిపైకి చిట్టి రాయల్ దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


