నాగలాపురం: కడుపు నొప్పి తాళలేక విషం తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అయ్యప్పనాయుడుకండ్రిగలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. ఇదే గ్రామానికి చెందిన మణినాయుడు భార్య రత్నమ్మ (51) గత కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం నొప్పి తీవ్రం కావడంతో ఇంట్లోనే విషం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను నాగలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని చైన్నె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం రత్నమ్మ మృతి చెందారు. కేసు దర్యాప్తులో ఉంది.
స్థిరత్వ విశ్లేషణపై వర్క్‌షాప్
ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మంగళవారం తిరుపతి ఐఐటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) ఉద్యోగుల కోసం ‘అధిక పునరుత్పాదక ఇంధన వినియోగంతో స్థిరత్వ విశ్లేషణ’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. ప్రారంభోపన్యాస కార్యక్రమానికి తిరుపతి ఐఐటీ కాంపిటెన్సీ డెవలప్‌మెంట్ – అవుట్‌రీచ్ డీన్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ తంగిరాల, ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.పి.నవీన్, ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎన్.శామ్యూల్ రాజు, ఐఐటీ ప్రోగ్రామ్ లీడ్ డాక్టర్ విఘ్నేష్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు, వివిధ విభాగాలకు చెందిన సుమారు 30 మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగడం వల్ల తలెత్తే విద్యుత్ వ్యవస్థ స్థిరత్వ సమస్యలపై అవగాహనతో పాటు ఆచరణాత్మక, ప్రత్యక్ష అనుభవాన్ని అందించేలా కార్యక్రమం జరిగింది.
యువజన ఉత్సవాల
పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్: జిల్లాలోని యువతలో సృజనాత్మకత, ప్రతిభ, సాంస్కృతిక నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్‌ను సెట్విన్ సీఈ యశ్వంత్‌కుమార్‌తో కలసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ఈ నెల 23న శ్రీ వేంకటేశ్వర పశు వైద్య కళాశాల ఆడిటోరియంలో ప్రారంభమవుతాయని, జిల్లాలోని 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు పాల్గొనవచ్చని తెలిపారు.


