సమస్యలు అనేకం.. పరిష్కారం నామమాత్రం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు అనేకం.. పరిష్కారం నామమాత్రం

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

● కలెక్టరేట్‌కు క్యూ కట్టిన అర్జీదారులు ● పీజీఆర్‌ఎస్‌కు 437 అర్జీలు

పింఛన్‌ ఇప్పించండి సారూ

మాది వెంకటగిరి. నా భర్త మృతి చెందారు. రెండేళ్లుగా వితంతు పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నాను. అయితే ఇటీవల పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వెళితే హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ సమయంలో నేను మా అమ్మ రేషన్‌ కార్డులో ఉన్నట్లు నమోదు చేశారు. మా అమ్మకు పింఛన్‌ వస్తున్న నేపథ్యంలో నేను దరఖాస్తు చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. మాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. నాకు పింఛన్‌ ఇప్పించాలని వేడుకుంటున్నా. –తమ బిడ్డలతో పార్వతి, వెంకటగిరి

తిరుపతి అర్బన్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారులు క్యూ కట్టారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 437 అర్జీలను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్‌, భరత్‌ నాయక్‌, రామాంజనమ్మ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు ఏకరువు పెట్టారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

కలుజు కాలువ ఆక్రమణ

రేణిగుంట మండలం, వెంకటాపురం కలుజు కాలువను సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం సర్వే నం.227లో 74 సెంట్లు ఆక్రమించిందని స్థానికులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆనేక కుటుంబాలు కలుజు కాలువ ఆక్రమణలో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురంతోపాటు కరకంబాడి, తిమ్మాయిగుంట, అంకమ్మనాయుడుమిట్ట, ఆర్‌ అగ్రహారం తదితర చెరువులకు సురక్షితంగా నీరు చేరాలంటే ఈ కలుజు కాలువ ఎంతో ఆదారమన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరి అండదండలతోనే ఆక్రమణ జరిగిందని ఆరోపించారు.

డీలర్లకు నేరుగా ఎరువులు ఇవ్వండి

కంపెనీల నుంచి నేరుగా చిట్టమూరు మండలంలోని రసాయనిక ఎరువుల దుకాణాలకు ఎరువులతోపాటు పురుగు మందులు అందించాలని డీలర్లు అసోసియేషన్‌ సంఘం అధ్యక్షుడు బాబురెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌ సందర్భంగా అగ్రికల్చర్‌ జేడీ ప్రసాద్‌రావుకు వినతిపత్రాన్ని అందించారు. నెల్లూరు నుంచి సరఫరా చేస్తే బస్తాకు రవాణా చార్జీ అదనంగా రూ.45, రేణిగుంట నుంచి సరఫరా చేస్తే బస్తాపై రవాణా చార్జీ రూ.60 పడుతుందని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీకి విక్రయిస్తే తమకు బస్తాపై రూ.50 నుంచి రూ.60 నష్టం వస్తోందని వాపోయారు. ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలంటే నేరుగా చిట్టిమూరు మండలంలోని డీలర్ల దుకాణాల వద్ద ఎరువులు దించాలని డిమాండ్‌ చేశారు. డీలర్స్‌ అసోసియేషన్‌ యూనియన్‌ నాయకులు భాస్కర్‌, సాయిరాం కృష్ణ, సుబ్బారావు, మహేష్‌నాయుడు, వేణురెడ్డి, సుబ్రహ్మణ్యం, ఎస్‌.కే.జలీల్‌, ఎస్‌.కే.కరిముల్లా, రాజేష్‌ నాయుడు, రవీంద్రబాబు పాల్గొన్నారు.

కోట్ల విలువ చేస్తే భూములు కబ్జా

రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 130, 142లో ఉన్న కోట్ల విలువచేసే సుమారు 350 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమిస్తున్నారని దళిత నిరుపేద మహిళలు తిరుపతి కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తమకు సెంటు భూమి లేదని, ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు జేసీబీలతో భూమిని చదును చేసి మామిడి మొక్కలు నాటుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా అడ్డుకోవాలని రాధిక, శివమ్మ, ఉమామహేశ్వరి, నదియా, కుమారి, దేవమ్మ, పార్వతి, ఇందిరమ్మ, వెంకటమ్మ, రాజమ్మ తదితరులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement