బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మాండ నాయకుడు సూర్య, చంద్ర ప్రభపై దేదీప్యమానంగా శ్రీవారు తిరుమంజనంలో మలయప్పకు విశేష అలంకరణ నేడు రథోత్సవం.. రాత్రి అశ్వ వాహనం రేపు చక్రస్నానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
ప్రభల తేజసం..
ఘటాటోపం నీడన చంద్ర ప్రభ వాహన సేవ(ఇన్‌సెట్) ప్రత్యేక
అలంకరణలో మలయప్ప
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా లు అంగరంగ వైభవంగా సాగుతున్నా యి. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్య ప్రభపై తేజోమయంగా, రాత్రి చంద్ర ప్రభపై చల్లని వెన్నెల కాంతుల్లో శ్రీమలయప్పస్వామి దేదీప్యమానంగా ఊరేగుతూ కనువిందు చేశారు. సూర్యప్రభ వాహనంపై స్వర్ణకాంతులు వెదజల్లుతూ భక్తకోటిని కటాక్షించిన స్వామివారు.. రాత్రి చంద్ర ప్రభపై శ్వేతవర్ణ పుష్పాలంకరణలో సాక్షాత్తు చల్లని చంద్రుడిని తలపించారు. వాహన సేవకు ముందే వర్షం రావడంతో ఘటాటోపం నీడలో చంద్రప్రభ వాహన సేవ సాగింది. స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం మహారథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. బుధవారం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వాహన సేవల ముందు వివిధ కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవల్లో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.


