శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ యాగశాల నుంచి పట్టువస్త్రాలు, పట్టు పవిత్రాలు, పాదుకలు, సుగంధ ద్రవ్యాలు తదితర పూజా సామగ్రిని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి వినాయకస్వామి, చెంగల్రాయస్వామి, శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ గర్భాలయాల్లో ఉంచి విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు గర్భాలాయల్లో విశేషాధిపూజా కార్యక్రమాలు నిర్వహించనున్న ఆ సమయాల్లో అంతరాలయ దర్శనం ఉండదన్నారు. ప్రతిరోజూ ఉదయం 10గంటలకు నిర్వహించే ఉచ్ఛికాల అభిషేకం పవిత్రోత్సవాల సందర్భంగా ఉదయం 9.30గంటలకు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం దీపారాధణ సేవ టిక్కెట్లు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.


