పెళ్లకూరు మండలంలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా భారీ యంత్రాలతో చెరువులను చెరబడుతున్న అధికార పార్టీ నేతలు గ్రావెల్, మట్టి తవ్వి ఇటుక బట్టీలకు తరలింపు ముడుపులు తీసుకుని చోద్యం చూస్తున్న అధికారులు అయోమయంలో ఆయకట్టు రైతులు
అధికార అండతో కూటమి నేతలు
చెలరేగిపోతున్నారు. పెళ్లకూరు మండలంలోని కొండలు, గుట్టలు, చెరువులను
చెరబడుతున్నారు. కాలువలు, అటవీ భూముల్లో వాలిపోతున్నారు. భారీ
యంత్రాలతో అక్రమంగా మట్టిని తవ్వి ఇటుక బట్టీలు, వెంచర్లు, పరిశ్రమలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రావులపాడు, రాజుపాళెం, చెంబేడు, పునబాక చెరువుల్లో ఇప్పటికే తవ్వకాలు సాగుతుండగా..
అటవీ భూములు, అసైన్‌మెంట్ భూములే లక్ష్యంగా చేసుకుని ఇబ్బడిముబ్బడిగా
లోడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా
సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి
చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పెళ్లకూరు: మండలంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు బరితెగించేశారు. అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని తహతహలాడుతున్నారు. తమకెదురే లేదన్న రీతిలో మట్టి తవ్వకాలకు పూనుకుంటున్నారు. నాయుడుపేట, మేనకూరు ప్రాంతాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు శిరసనంబేడు, రాజుపాళెం, రోసనూరు గ్రామాల్లోని చెరువులు, తెలుగుగంగ కాలువ గట్లు, ప్రభుత్వ భూముల్లోని గ్రావెల్‌ను తవ్వేసి తరలించేస్తున్నారు. చెరువుల్లో గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టరాదని కోర్టు ఆదేశాలున్నా ఇక్కడి అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు.
పట్టించుకోని అధికారులు
స్వర్ణముఖి నది నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా.. రావులపాడు, రాజుపాళెం, శిరసనంబేడు గ్రామాల నుంచి మట్టి, గ్రావెల్ ఎత్తుకెళ్తున్నా ఇక్కడి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మైనింగ్, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడి వ్యాపారుల నుంచి వివిధ శాఖల అధికారులు భారీగా ముడుపులు తీసుకుంటున్న తెలుస్తోంది.
రావులపాడు కేంద్రంగా మట్టి తవ్వకాలు
మండలంలోని రావులపాడు గ్రామంలో అసైన్‌మెంట్ పొలాల నుంచి చెరువు కట్టలను తవ్వేసి లారీలతో మట్టి తరలిస్తున్నారు. శిరసనంబేడు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులను లక్ష్యంగా చేసుకుని లారీలు, టిప్పర్లతో మట్టి తరలిస్తున్నారు. ఆ మట్టిని బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి రవాణా కోసం చెరువులో తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తాళ్వాయి పాడు, పెన్నేపల్లి ప్రాంతాల్లోని ఇటుక బట్టీలతో పాటు దొరవారిసత్రం, నాయుడుపేటలో ఉన్న ఇటుక బట్టీలకు లారీలతో మట్టి తరలిస్తున్నారు. స్థానిక రైతుల ముసుగులో కొందరు టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారుల నుంచి తాత్కాలిక అనుమతులు పొంది అక్రమాలకు పాల్పడుతున్నారు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఓ అగ్రనేత ఉన్నట్టు సమాచారం. మట్టి అక్రమ రవాణాతో రోడ్లు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు వాపోతున్నారు.
చర్యలు తీసుకుంటాం
రావులపాడు గ్రామంలో వ్యవసాయ భూములు లెవలింగ్ పనుల కోసం నాలుగు రోజులు మట్టి తరలింపులకు అనుమతులు పొందారు. కానీ ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే రోసనూరు, శిరసనంబేడు, రాజుపాళెం చెరువులు, పలు ప్రాంతాల్లోని అటవీ భూములు, అసైన్‌మెంట్ భూములు, తెలుగుగంగ పొర్లు కట్టలు, చెరువుల్లో మట్టి, గ్రావెల్ త్రవ్వకాలు, స్వర్ణముఖినది నుంచి అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపడుతాం.
– హరికృష్ణ, తహసీల్దార్, పెళ్లకూరు


