ఈకేవైసీ పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

ఈకేవైసీ పూర్తి చేయండి

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

తిరుపతి అర్బన్‌: జిల్లా వాప్యంగా రైతులు సాగుచేసిన పంటలకు సంబంధించి వంద శాతం ఈకేవైసీ ప్రక్రియను వ్యవసాయశాఖ నేతృత్వంలో పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో సోమవారం వరి ధాన్యం కొనుగోలుతోపాటు ఈకేవైసీ పూర్తి చేయడానికి అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ ఈకేవైసీ ఉంటేనే వరి ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే విషయాన్ని రైతులకు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలన్నారు. అలాగే 2026–27 రబీకి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో శేషాచలం రాజు, డీఎం దేవుళ్ల నాయక్‌, అగ్రికల్చర్‌ జేసీ ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

ఫిజియోథెరపిస్ట్‌

మెరిట్‌ లిస్ట్‌ విడుదల

తిరుపతి తుడా: కాంబియైండ్‌ నోటిఫికేషన్‌ – 2025లో భాగంగా ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుకు సంబంధించి మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ పర్మిషన్‌ మేరకు మెరిట్‌ లిస్టును స్విమ్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఫైనల్‌ లిస్ట్‌కు సంబంధించి అభ్యర్థులకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మంగళవారం సాయంత్రం 5గంటల్లోపు ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

వర్షాలపై విద్యుత్‌శాఖ అప్రమత్తం

తిరుపతి రూరల్‌: భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అధికారులుతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. స్తంభాలు కూలిపోవడం, విద్యుత్‌ తీగలు తెగిపడటం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సమీప విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే 1912, 1800 425 155333 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా 91333 31912 వాట్సాప్‌ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు గురజాడ అప్పారావు చిత్రపటానికి నివాళి అర్పించారు.

డయల్‌ యువర్‌ సీఎండీకి 103 వినతులు

‘డయల్‌ యువర్‌ సీఎండీ’, ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాలకు 103 మంది వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వివిధ సమస్యలపై వినతులు అందినట్లు సీఎండీ శివశంకర్‌ తెలిపారు.

పరిశ్రమల్లో పటిష్ట భద్రత

తిరుపతి అర్బన్‌: పరిశ్రమల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ వెల్లడించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగల్‌ డెస్క్‌ విధానంలో 190 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందులో 151కి అనుమతులు ఇచ్చామని తెలిపారు. దీంతో పలువురుకి ఉద్యోగ ఉపాధి లభిస్తుందని వివరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ జయకృష్ణ, జిల్లా పరిశ్రమల జీఎం చంద్రశేఖర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ విజయభరత్‌రెడ్డి, అగ్రిమాపక అధికారి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,019 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,431 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement