శ్రీకాళహస్తి: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో నిర్వహించిన సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ నేషనల్ చాంపియన్‌షిప్–2026లో శ్రీకాళహస్తికి చెందిన పత్తి నిత్య హాసిని అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. శ్రీకాళహస్తిలోని ఫిట్‌నెస్ సెంటర్ నిర్వాహకులు జ్యోతిరావు, రూపాదేవి దంపతుల కుమార్తె నిత్య హాసిని ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ జాతీయ స్థాయి పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రో రెండు విభాగాల్లో పాల్గొన్నారు. షాట్‌పుట్‌లో 12.12 మీటర్లు విసిరి ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. డిస్కస్ త్రోలో 33.85 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. షాట్‌పుట్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో నిత్య 11.21 మీటర్లు సాధించగా.. జాతీయ స్థాయిలో తన ప్రదర్శనను 12.12 మీటర్లకు మెరుగుపరుచుకున్నారు. అంటే ఏకంగా 91 సెంటీమీటర్ల మెరుగుదల సాధించడం విశేషం. అదేవిధంగా డిస్కస్ త్రోలో రాష్ట్ర స్థాయిలో 31.40 మీటర్లు సాధించిన నిత్య.. జాతీయ స్థాయిలో 33.85 మీటర్లు విసిరి తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణవాసులు సైతం నిత్య విజయాన్ని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


