చంద్రగిరి: ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన చంద్రగిరి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి రవితేజ (18) తిరుపతి నుంచి తన స్వగ్రామమైన ఐతేపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గం మధ్యలోని చంద్రగిరి సమీపంలో ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని రవితేజ నడుపుతున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతరం చైన్నెలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడ చికిత్స పొందుతున్న రవితేజ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రవితేజ ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.


