రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Sep 19 2026 8:56 AM | Updated on Sep 19 2026 8:56 AM

రేణిగుంట: మండలంలోని పుత్తూరు–రేణిగుంట రహదారి కాటన్‌ మిల్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంజయ్‌ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి రేణిగుంట పంచాయతీలోని నేతాజీ కాలనీకి చెందిన సంజయ్‌ (17) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కాటన్‌ మిల్లు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అడ్డురావడంతో అతడిని తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డాడు. తలకి తీవ్ర గాయమైంది. స్థానికులు సమీపంలోని ప్రయివేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంజయ్‌ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గాజులమండ్యం పోలీసులు తెలిపారు.

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు

వేగవంతం చేయండి

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఆర్‌డీఎస్‌ఎస్‌ (పునర్వ్యవస్థీకరణ విద్యుత్‌ పంపిణీ పథకం) కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి ఆదేశించారు. శుక్రవారం కార్పొరేట్‌ కార్యాలయం నుంచి అధికారులు, కాంట్రాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పనుల పురోగతిని సమీక్షించారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ, మౌలిక వసతుల బలోపేతం, విద్యుత్‌ నష్టాల నియంత్రణ, వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్‌ పి.అయూబ్‌ ఖాన్‌న్‌తో పాటు సీఎజీఎంలు, జీఎంలు, తొమ్మిది జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలు, ఆర్‌డీఎస్‌ఎస్‌ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

వైభవంగా మహాలక్ష్మియాగం

నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ కళాశాలలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న నవాహ్ని హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం లక్ష కుంకుమార్చన, ఆధ్యాత్మిక ప్రవచనాలు వైభవంగా జరిగాయి. ఉదయం 8.30 గంటలకు కళాశాల చైర్మన్‌ అశోక్‌రాజు దంపతుల ఆధ్వర్యంలో ఆగమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహాలక్ష్మి యాగం, లక్ష కుంకుమార్చన పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి రెండు గంటల పాటు ‘యజ్ఞఫలం – లోకక్షేమం’ అంశంపై డాక్టర్‌ శేషచార్యులు ప్రవచించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారి పల్లకీ సేవను నిర్వహించారు. అశోక్‌రాజు మాట్లాడుతూ మహాలక్ష్మి యాగంతో ప్రజలందరికీ ధార్మిక, ఆర్థిక, సాంస్కృతిక, జ్ఞాన, విజ్ఞాన, సిరిసంపదలు చేకూరుతాయన్నారు.

వరకట్నం కేసులో

ఇద్దరికి మూడేళ్ల జైలు

డక్కిలి: వరకట్నం కేసులో భర్త, అత్తకు మూడేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికీ రూ.15వేలు జరిమానా విధిస్తూ వెంకటగిరి జూనియర్‌ సివిల్‌జడ్జి న్యాయమూర్తి విష్ణువర్మ శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు.. డక్కిలి మండలంలోని మిట్టపాళెం గ్రామానికి చెందిన రంగినేని మంజులను 13 ఏళ్ల క్రితం నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన రంగినేని ప్రదీప్‌రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. కొన్ని సంవత్సారాల నుంచి మంజులను భర్త, అత్త మనసికంగా, శారీరకంగా వేధించేవారు. దీనిపై 2018లో డక్కిలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్‌ఐ మరిదినాయుడు గృహ హింస, వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన పిదప తల్లి, కుమారుడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ఏపీపీ వీ.రోహిత్‌ వాదనలు వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement