టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై.. బాబు పచ్చి అబద్ధాలు | - | Sakshi
Sakshi News home page

టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై.. బాబు పచ్చి అబద్ధాలు

Sep 19 2026 8:56 AM | Updated on Sep 19 2026 8:56 AM

2023లో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి జగనన్నదే 2023లో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు జగనన్న అధికారంలోకి రాగానే టీటీడీలోని 7వేల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం మీడియా సమావేశంలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి మంగళం : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు శ్రీవారి సన్నిధిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది తానేనని పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా, తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించినట్టు గుర్తుచేశారు. ఆయన అకాల మరణం చెందడం, కోర్టు వ్యాజ్యాలతో ఆ కార్యాచరణను పూర్తి చేయలేకపోయామన్నారు. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, తాను శాసనసభ్యుడిగా, టీటీడీ అధ్యక్షుడిగా ఉండి టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల కల నెరవేర్చాలా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. 12 ఎకరాలు యుద్ధప్రాతిపదికన సమీకరించి 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు అందించామన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో టీటీడీ ఉద్యోగులకు ఆ తర్వాత చేయాల్సిన పనులన్నీ నిలిచిపోయాయన్నారు. 17 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా టీటీడీ ఉద్యోగుల బాగు కోరుకున్నారా? అని ప్రశ్నించారు. 1989లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి తిరుపతి బైరాగిపట్టెడలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల సంకల్పం వైఎస్‌ రాజశేఖరరెడ్డిదైతే ఆ కార్యాచరణను పూర్తిచేసిన ఘనత జగనన్నదని పేర్కొన్నారు.

టీటీడీలో శాశ్వత ఉద్యోగులు ఉండకూడదా?.

శాశ్వతంగా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవచ్చు కానీ, టీటీడీలో శాశ్వత ఉద్యోగులు ఉండకూడదా? అని భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. శ్రీవారి సేవకులతో సేవ చేయించుకుంటే సరిపోదా అని చంద్రబాబు మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు. చంద్రబాబు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు కానీ టీటీడీ ఉద్యోగులు మాత్రం సేవకులుగా పనిచేయాలా..? అని భూమన ప్రశ్నించారు. జగనన్న అధికారంలోకి రాగానే టీటీడీలో ఖాళీగా ఉన్న 7వేల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందులో స్థానికులకు 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు కోసం టీటీడీ ఉద్యోగులకు చంద్రబాబు పట్టాలు ఇచ్చినట్లుగా పచ్చి అపద్ధాలు చెబుతున్నారని భూమన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement