రేణిగుంట రైల్వేస్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్‌

Sep 19 2026 8:50 AM | Updated on Sep 19 2026 8:50 AM

రేణిగుంట: రేణిగుంట రైల్వే స్టేషన్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ నుంచి విద్యుత్‌ వైర్లు పట్టుకునేందుకు ప్రయత్నించి హల్‌చల్‌ సృష్టించాడు. అతికష్టం మీద రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తిరుపతి రుయా హాస్పిటల్‌లోని మానసిక వైద్యశాలకు తరలించారు.

స్థానికుల కథనం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రకాష్‌రాయ్‌ (35) కేరళలో వంట మాస్టర్‌. సొంత ఊరికి వెళ్లేందుకు కేరళ నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా శుక్రవారం ఉదయం రేణిగుంట రైల్వే స్టేషన్‌ సమీపంలో జనరల్‌ బోగీలో అతడికి మిగిలిన ప్రయాణికులకు గొడవ జరిగినట్లు సమాచారం. రైల్వే స్టేషన్లో అతడిపై పోలీసులకు సమాచారం ఇస్తారేమోనని ముందుగానే రైలు దిగి స్టేషన్లోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ పైకి ఎక్కి అక్కడి నుంచి విద్యుత్‌ లైన్లు పట్టుకుంటానని బెదిరించాడు. అధికారులు స్పందించి విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేశారు. బ్రిడ్జ్‌ పైనుంచి వేలాడుతూ రైలు పైకి దూకి పరుగులు తీయగా స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రేణిగుంట రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్లే రైళ్లన్నీ దాదాపు గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి. ఎంతటి పోలీసులకు అతడి వివరాలు తెలపకపోవడంతో అతడి వద్ద ఉన్న సిమ్‌ కార్డ్‌ ఆధారంగా అతడు వివరాలను పోలీసులు సేకరించారు. మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా అతడిని తిరుపతి రుయా హాస్పిటల్‌లోని మానసిక వైద్య విభాగంలో చేర్పించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement