తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీల్లో రెండు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. రీజనల్ సైన్స్ సెంటర్, జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా శుక్రవారం తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్‌లో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలను నిర్వహించాయి. ఈ ఏడాది భారతదేశ ఇంధన శక్తి వనరుల సముదాయం 2027–అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన పోటీలకు జిల్లా నుంచి 45 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వీరు రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వ్యాసరచన ద్వారా వివరించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన శ్రీకాళహస్తి బాలికోన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఎం.సిరి, గైడ్ టీచర్ పద్మజ మొదటి స్థానం సాధించగా, సూళూరుపేట జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని బి.లక్ష్మీప్రసన్న దుర్గ, గైడ్ టీచర్ మంజుల ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపికయ్యారు. ఈ నెల చివరి వారం విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. మొదటి రెండు స్థానాలు సాధించిన విద్యార్థినీలను డీఈఓ కేవీఎన్.కుమార్, ఎస్‌ఎస్ ఏపీసీ ఎం.భరత్‌కుమార్‌రెడ్డి, సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస నెహ్రూలు అభినందించి సర్టిఫికెట్లు, బహుమతులను అందించారు.


