శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధానకర్త సతీష్ మండువ గురువారం శ్రీసిటీని సందర్శించారు. రాష్ట్రానికి ఉత్తర అమెరికా పెట్టుబడులను ఆకర్షించేందుకు నియమితులైన ఆయన యూఎస్–ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా, ఇంటెలిసాఫ్ట్ టెక్నాలజీస్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధంతో పాటు ఉత్తర అమెరికా వ్యాపార వర్గాల్లో విస్తృత పరిచయాలు, అనుభవం ఉన్నాయి. శ్రీ సిటీకి చేరుకున్న సతీష్ మండువకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవకాశాలను ఉత్తర అమెరికా పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో ఆయన చేస్తున్న కృషి అభినందించారు. మోడల్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా శ్రీసిటీని అభివృద్ధి చేయడంలో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి దూరదృష్టి, పట్టుదలను అభినందించారు. పర్యటనలో భాగంగా స్థానిక డైకిన్ పరిశ్రమను సందర్శించి, అక్కడ సంస్థ ప్రతినిధులతో చర్చించారు.


