రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

రాపూరు : పట్టణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. స్థానిక పడమటి అగర్తకట్టకు చెందిన భూపతి శ్రీదేవి (53) ఇంటి నుంచి బజారుకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మోటార్‌ సైకిల్‌ ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుమలరావు తెలిపారు.

ఫాస్ట్‌ఫుడ్‌ తయారీపై

ఉచిత శిక్షణ

చంద్రగిరి : యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 21వ తేదీ నుంచి 12 రోజుల పాటు పురుషులు, మహిళలకు ఫాస్ట్‌ ఫుడ్‌ తయారీపై ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ పి. సురేష్‌ బాబు బుధవారం తెలిపారు. తెల్ల రేషన్‌ కార్డు గల గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ పురుషులు, మహిళలు అర్హులన్నారు. కనీసం 8వ తరగతి చదువుకుని ఉండాలని చెప్పారు. ట్రైనీస్‌కి ఉచిత భోజనం, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవా రు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు జెరాక్స్‌ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ముందుగా పేరు నమోదు చేసుకున్న ప్రాధాన్యతనిస్తామన్నారు. ఇతర వివరాలకు యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్‌ (రాయల్‌ విక్టరీ స్కూల్‌ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

భక్తుడికి నగల బ్యాగు అప్పగింత

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ : అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద బంగారు నగలు, నగదుతో కూడిన బ్యాగును మరచివెళ్లన భక్తుడికి తిరిగి బ్యాగును అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా పీర్లగూడానికి చెందిన జనార్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం ఉదయం అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద తమ బ్యాగును మరిచి తిరుమలకు చేరుకున్నారు.భద్రతా సిబ్బంది సదరు బ్యాగును సెక్టార్‌ కార్యాలయానికి చేర్చారు. అందులో నగదు రూ. 32 వేలు, సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగును మరిచిపోయిన వారు తిరిగి అలిపిరి చెక్‌పాయింట్‌ వద్దకు చేరుకున్నారు. వారి వివరాలను నిర్ధారించుకుని ఏవీఎస్‌ఓ రమేష్‌కుమార్‌ ఆ బ్యాగ్‌ను తిరిగి అప్పగించారు.

రైల్వేట్రాక్‌పై

గుర్తుతెలియని మృతదేహం

తిరుపతి అర్బన్‌ : తిరుపతి– తిరుచానూరు రైల్వే స్టేషన్‌ మధ్య చింతల చేను వద్ద గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 35 ఏళ్లు) మృతదేహం ఉందని రైల్వే ఇన్‌స్పెక్టర్‌ వరప్రసాద్‌ బుధవారం తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని వెల్లడించారు. మృతుడి వివరాలు తెలియలేదని, ఈ మేరకు కేసు నమోదు చేసి ఎస్వీ మెడికల్‌ కళాశాల మార్చురీకి మృతదేహం తరలించినట్లు వివరించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9247575618 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

విద్యుదాఘాతానికి

యువకుడి బలి

సైదాపురం : మండలంలోని తురిమెర్లలో మంగళవారం అర్ధరాత్రి విద్యుదాఘాతానికి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. సైదాపురానికి చెందిన కాకాణి నాగరాజు, ప్రమీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. నాగరాజు కొంతకాలంగా తురిమెర్లలోని అత్తగారింట్లోనే కాపురం ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. మంగళవారం రాత్రి ఆరు బయట ఫ్యాన్‌ పెట్టుకుని కుటుంబ సమేతంగా పడుకున్నాడు. అర్ధరాత్రి దాహం వేసి నీరు తాగేందుకు ఇంట్లోకి వెళ్లి వస్తుండగా తలుపులు తగిలి ప్లగ్‌బాక్స్‌ వైర్‌ తెగిపోయింది. దానికి మరమ్మతు చేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుక యత్నించగా అప్పటికే మరణించాడు. సమాచారం అందుకునన స్టేషన్‌ ఇన్‌చార్జి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద మృత్యువాత పడడంతో భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement