రూ.కోట్ల కాలువ కబ్జా! | - | Sakshi
Sakshi News home page

రూ.కోట్ల కాలువ కబ్జా!

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

● ఆక్రమిత స్థలలో ప్రహరీ గోడ నిర్మిస్తున్న ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యం ● అండగా నిలబడిన టీడీపీ నేతలు ● కన్నెత్తి చూడని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు

రేణిగుంట : తిరుపతి– కరకంబాడి రహదారిలోని రేణిగుంట మండలం వెంకటాపురం చెరువు కలుజు నుంచి నీరు వెళ్లే కాలువను ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం కబ్జా చేసేస్తోంది. 227 సర్వే నంబర్‌లోని 74 సెంట్లను టీడీపీ స్థానిక నేతల అండతో ఆక్రమించుకుని ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టింది. కబ్జాకు సహకరిస్తున్నందుకు సదరు పచ్చనేతలు భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.3కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైనప్పటికీ ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. పేదలు రెండు సెంట్ల పోరంబోకు భూమిలో ఇల్లు కట్టుకుంటేనే కూల్చి వేసే అధికారులు ఇప్పుడు రూ.కోట్ల స్థలం చెరబడుతున్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీటికి దారేది..?

వెంకటాపురం చెరువు నుంచి ఈ కాలువ ద్వారా మరో రెండు చెరువులకు నీరు వెళుతుంది, ఇప్పుడు కాలువను కబళించేసి ప్రహరీ గోడ నిర్మిస్తే నీరు దిగువకు ఎలా వెళుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కింది చెరువుల ఆయకట్టు రైతులు పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఆక్రమణ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించాలని కోరుతున్నారు.

గతంలో సైతం ఆక్రమణ

సదరు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం గతంలో సైతం వెంకటాపురం చెరువుకు సంబంధించి సర్వే నంబర్‌ 225/1లో ఒక ఎకరా ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించుకున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా మళ్లీ కబ్జాకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారలు వెంటనే పూర్తిస్థాయిలో సర్వే చేయించి చెరువు భూమిని కాపాడాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే దీనిపై తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ వివరణ తీసుకునేందుకు యత్నించగా, ఆయన స్పందించలేదు.

వెంకటాపురం చెరువు కలుజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement