వైభవంగా కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

● పెద్ద శేష వాహనంపై పరమపదనాథుడిగా స్వామివారి దర్శనం ● కంకణధారణ చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు

ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం

తిరుపతి రూరల్‌: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆగమోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. అంతకుముందు భేరిపూజ, భేరితాడనం, ధ్వజపటం, నవసంధి, మాడవీధి ఉత్సవం, ఆస్థానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

పెద్ద శేషునిపై పరమాత్ముడు

బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి పెద్ద శేష వాహన సేవ కన్నులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు ఏడుతలల పెద్దశేష వాహనంపై పరమపదనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు జరిగిన వాహన సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు.

కంకణ ధారణ

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలనే సంకల్పంతో ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు కంకణధారణ చేసుకున్నారు. ధ్వజారోహణం సందర్భంగా కంకణం కట్టుకుని దీక్ష చేపట్టారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనులవారు తుమ్మలగుంట గ్రామంలో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పట్టువస్త్రాలు సమర్పణ

తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పెద్ద శేష వాహన సేవకు పాకాల మండలం దామలచెరువు, ఉప్పరపల్లి, పెద్ద రామాపురం, కొత్త వడ్డేపల్లి, మొగరాల, రమణయ్యగారిపల్లి, గానుగపెంట, ఇ.పాలగుట్టపల్లి, వల్లివేడు, పేరసానిపల్లి, మద్దినాయునిపల్లి, పదిపుట్లబైలు గ్రామాలకు చెందిన భక్తులు పట్టువస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement