సాక్షి, టాస్క్‌ఫోర్స్: శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. ఆరోగ్యశ్రీ, ఏపీవీపీ నిధులను ఇద్దరు ఉద్యోగులు స్వాహా చేసినట్టు తేలింది. ప్రాథమిక విచారణలో స్వాహా సొమ్ము రూ.25 లక్షలుగా తేలిందని, మరింత లోతుగా విచారణ చేస్తే రూ.కోటి వరకు అవినీతి బయటపడవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులపై మంగళవారం టూ టౌన్ పోలీసులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళి ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఆస్పత్రి పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఆర్థిక లావాదేవీల పనులను ఎల్డీసీగా ఉన్న లక్ష్మీప్రసన్న, పోస్టుమార్టం అసిస్టెంట్‌గా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చందుకు యాజమాన్యం అప్పగించింది. ఈ క్రమంలో లక్ష్మీప్రసన్న ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉండగా చెక్కుల డ్రా చేసే పనిని చందూకు అప్పగించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ నిధుల్లో గోల్‌మాల్ జరిగినట్టు బయటకు పొక్కడంతో సంబంధిత అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. ఇందులో ప్రాథమికంగా రూ.25 లక్షలు స్వాహా చేసినట్టు తేలింది. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఆ స్థాయిలో నిధులు స్వాహా చేసి ఉంటారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. కూటమి నేతలు సభ్యులుగా ఉన్న ప్రభుత్వాస్పత్రిలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు గోల్‌మాల్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


