నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో నవాహ్నిక భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం మంగళవారం ప్రారంభమైంది. కళాశాల చైర్మన్ అశోకరాజు దంపతుల ఆధ్వర్యంలో 225 మంది వేద పండితుల సమక్షంలో యాగానికి అంకురార్పణ చేపట్టారు. యాగశాలలో శ్రీదేవీ, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి తిరుమంజం నిర్వహించి, ఆకల్పాంత హోమం, పంచగవ్య ప్రాశన, వాస్తు హోమం, దీక్షా ధారణ, కంకణ ధారణ పూర్తిచేశారు. సాయంత్రం అంబటిపూడి రాధాకృష్ణేశ్వర్ ‘భారత విశ్వ గురుత్వము, సనాతన ధర్మం‘ పై ప్రవచనం అనంతరం వివిధ రకాల పూజలు చేశారు. అశోకరాజు మాట్లాడుతూ మంగళవారం నుంచి 23వ తేదీ వరకు హోమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. లోక కళ్యాణానికి, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు భారత్ ‘విశ్వగురు’గా నిలవాలనే సంకల్పంతో ఈ యాగాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక క్రతువులో అందరూ పాల్గొని దైవానుగ్రహం పొందాలని ఆయన కోరారు.


