తిరుపతి క్రైం : సీసీ కెమెరాలు, జీపీఎస్, ఇతర సాంకేతిక ఆధారాలను ఉపయోగించి తిరుపతి ఈస్ట్ పోలీసులు పలు దొంగతనం కేసులను ఛేదించారు. ఐదు కేసుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసి.. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, బంగారు గొలుసు తదితరాలు కలిపి సుమారు రూ.13.8 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌న్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసుల దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో పాటు స్థానికంగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి నిందితులను గుర్తించారు. కేసుల వివరాలను తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్‌న్) ఆర్ల శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) కె.రవిమనోహరాచారి వెల్లడించారు.
ట్రాక్టర్ చోరీ కేసులో..
జమ్మలమడుగుకు చెందిన గొంగాటి మల్లికార్జున్‌న్‌రెడ్డి (38)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన ట్రాక్టర్, ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అలిపిరి పోలీస్ స్టేషన్‌న్ పరిధిలో జరిగిన మరో ట్రాక్టర్ చోరీ కేసులో ఇంజిన్‌ను కూడా దొంగిలించినట్లు వెల్లడైంది. దీంతో ఆ కేసుకు సంబంధించిన సుమారు రూ.1.5 లక్షల విలువైన ఇంజిన్, ట్రాలీని రికవరీ చేశారు.
మూడు బైక్‌లు స్వాధీనం
రోడ్డుపై తాళాలు వేసి నిలిపిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దాయనబోయిన రవి (55)ని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.50 వేల విలువైన హీరో ప్లెజర్, మరో రూ.50 వేల విలువైన హీరో స్ల్పెండర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పిడుగురాళ్లకు చెందిన శివరాత్రి చందు (23) దొంగిలించిన రాయల్ ఎన్‌న్‌ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.90 వేల విలువైన బైక్‌లను రికవరీ చేశారు.
చైన్‌స్నాచింగ్ కేసు ఛేదన
వృద్ధురాలి మెడలోని 35 గ్రాముల బంగారు గొలుసును అపహరించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తిరుపతి డీఎస్పీ పర్యవేక్షణలో ఈస్ట్ సీఐ, ఎస్‌ఐలు, ఐడీ పార్టీ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి గిద్దలూరుకు చెందిన కొప్పాలి గీత (25)ను గుర్తించి అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.1.4 లక్షల విలువైన 35 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.


